
సినిమాలో ప్రొడక్షన్ విభాగంలో క్యాషియర్‌గా మొదలైన ప్రస్థానం.. చివరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకుంది.. హ్యాపీడేస్ సినిమాతో మొదలై.. క్రమంగా శేఖర్ కమ్ములతో ప్రయాణం సాగించారు. అలా ఆవకాయ బిర్యానీ సినిమాకు పనిచేశారు. ఈ క్రమంలో తన హార్డ్ వర్క్ నచ్చి శేఖర్ కమ్ముల మెచ్చుకున్నారు. తర్వాత లీడర్ సినిమాకు టీంలో చేరమని కబురు పంపారు. ఇదే ఆయన జీవితంలో కీలక మైలు రాయని, తెరవెనుక తాను పడిన కష్టమే తనను అనేక మెట్లు ఎక్కించిందని చెబుతున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇర్ల నాగేశ్వర్‌రావు.
పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా మాచవరంలోనే. పిడుగురాళ్లలో ఇంటరీ్మడియట్, నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఓ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్ చేరారు. దగ్గుబాటి రానా నటించిన లీడర్ సినిమాకు శేఖర్ కమ్ముల టీంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. అలా క్లాప్ కొట్టడం, తర్వాత ఆర్టిస్టులను కో–ఆర్డినేషన్ చేయడం. అగ్ర నటులు గొల్లపూడి మారుతి రావు, నటి సుహాసిని, నటుడు హర్షవర్ధన్, హీరోయిన్ ప్రియా, కోట శ్రీనివాసరావు వంటి వారికి దగ్గరయ్యారు.
వివిధ విభాగాల్లో..
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ కోసం క్రమంగా ఫిదా సినిమాకు ప్రొడక్షన్ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. తర్వాత లవ్ స్టోరీ సినిమాకూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో పని నచ్చడంతో శేఖర్ కమ్ముల అమిగోస్ ప్రొడక్షన్స్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు.
కుబేర విజయంలోనూ లొకేషన్స్ పరంగా కీలకపాత్ర పోషించారు. ‘నేను జీవితంలో మంచి చెడు పంచుకునే మొదటి వ్యక్తి శేఖర్ గారు. ఆయనతో నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా’ అని చెబుతున్నారు నాగేశ్వర్‌రావు. ప్రస్తుతం అమిగోస్ ప్రొడక్షన్ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!)