
కొన్ని నెలల క్రితం వరకు నేను ఆన్‌లైన్‌లో గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు వెచ్చించి ఆడేవాడిని. అలా కొంత డబ్బులు పోగొట్టుకున్నాను మరికొంత సంపాదించాను. నాలుగు నెలల క్రితం సైబర్ కంప్లైంట్ కారణంగా నా బ్యాంక్ ఖాతా సీజ్ చేసినట్లు బ్యాంకు వారు తెలిపారు. అంతకు మించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. నా జీతం అదే ఖాతాలో డిపాజిట్ అవుతుంది. నేను పనిచేస్తున్న కంపెనీకి ఈ విషయం చెప్పి ఎకౌంటు మార్చమని అడుగుదామనుకుంటే... ఆ కేసు విషయం అందరికీ తెలిసి, నా ఉద్యోగం పోతుందనే భయంతో చెప్పలేకపోతున్నాను. నెల జీతం వస్తోంది కానీ విత్ డ్రా చేయలేని పరిస్థితి. బ్యాంకు వారిని సంప్రదించినప్పటికీ పరిష్కారం దిశగా సమాధానం ఇవ్వడం లేదు. నా ఉద్యోగానికి ఎటువంటి ముప్పు రాకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పగలరు.
– కృష్ణ చైతన్య, హైదరాబాద్
ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ చట్టం, 2025 ఇటీవలే అమలులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటిని రెగ్యులేట్ చేయడం, వ్యసనాలకు దారి తీయకుండా చేయటం, ఆన్లైన్ ఫైనాన్షియల్ మోసాలను అరికట్టటం, కుటుంబాలను– యువతను కూడా ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంచటం, దేశ ఖజానాకు భంగం కలిగించకుండా ఉండడం వంటివి ఈ చట్టం ముఖ్య ఉద్దేశాలు. ఈ చట్టం అమలులోకి రాకముందు చాలా ఉదంతాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అందులో చాలా యాప్స్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు జరిగాయి అని వేల సంఖ్యలో కంప్లైంట్లు ఇచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో వేల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు సీజ్ కూడా అయ్యాయి. బహుశా మీరు వాడిన బెట్టింగ్/గేమింగ్ యాప్ ఏదో ఒక నేరంలో ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో బ్యాంకు వారు కూడా ముందస్తు చర్యగా ఎకౌంటును సీజ్ చేయవచ్చు. అయితే అందుకు గల కారణాలను సదరు ఖాతాదారులకు ఇవ్వడం బ్యాంకు వారి బాధ్యత.
ఇక దీని మూలంగా మీ ఉద్యోగానికి ఏదో జరిగిపోతుంది అనే కంగారు ప్రస్తుతానికి అవసరం లేదు. బ్యాంకు వారికి మీ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి గల కారణాలు అలాగే ఏదైనా పోలీసు వారు కానీ, మరి ఎవరైనా అధికారులుగానీ ఇచ్చిన ఆర్డర్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియజేయాలి అంటూ లిఖితపూర్వకంగా ఒక వినతిపత్రం ఇచ్చి అక్నాలెడ్జెమెంట్ తీసుకోండి. కుదరని పక్షంలో రిజిస్టర్డ్ ΄ోస్టు ద్వారా మీ దరఖాస్తును/వినతి పత్రాన్ని పంపవచ్చు. ఏదైనా పోలీసు కేసు వలన మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిందని తెలిస్తే, సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు లో సి.ఆర్.పి.సి సెక్షన్ 457 ప్రకారం ఒక దరఖాస్తు చేసుకొని ఎకౌంటును డీ ఫ్రీజ్ చేయించుకోవచ్చు.
లేకపోతే నేరుగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి కూడా మీ అకౌంటును డీ ఫ్రీజ్ చేయమని కోరవచ్చు. అలాంటి కంప్లైంట్ ఏమీ లేకుండా ఒకవేళ బ్యాంకు వారు ఫ్రీజ్ చేసినట్టు అయితే అది కేవలం కొంతకాలానికి మాత్రమే చెల్లుతుంది. నేరంలో భాగంగా ఉన్న సొమ్మును అలాగే ఎకౌంట్లో ఉంచి మిగతా అకౌంట్ లావాదేవీలను డీ ఫ్రీజ్ చేయాలి అని కోర్టు ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇకపోతే ఏదైనా ఎఫ్.ఐ.ఆర్.లో మీరు నిందారోపితుడు అయి ఉంటే తప్ప మీ ఉద్యోగానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు.
ఎందుకంటే మీరు నేరుగా ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి. గేమ్స్ ఆడిన వారిపై ప్రస్తుతానికి శిక్షలు లేవు కనుక మీరు ఈ విషయాన్ని మీ కంపెనీ వారికి చెప్పినా ఏమీ కాదు. అయితే అలా చెప్పే ముందు సైబర్ కంప్లైంట్‌లో మీరు నిందారోపితుడుగా (అక్యూజ్డ్ గా) ఉన్నారేమో చూసుకోండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: Success Story: ఇంటి పనులకే పరిమితమైన స్థాయి నుంచి డీఎస్పీ రేంజ్‌కి..!)