నిర్మాతగా నిత్యా మీనన్‌  | Nithya Menen Turns Producer, Launches Keyuri Productions | Sakshi
Sakshi News home page

నిర్మాతగా నిత్యా మీనన్‌ 

Feb 19 2026 5:20 AM | Updated on Feb 19 2026 9:35 AM

Nithya Menen Turns Producer, Launches Keyuri Productions

– సమాజాన్ని ప్రభావితం చేసే చిత్రాలకేప్రాధాన్యం 

‘‘సినిమాలు తీయడమంటే కథలు చెప్పడం మాత్రమే కాదు... నాకు అంతకన్నా ఎక్కువ. మనుషుల అంతరంగాన్ని తాకే ప్రక్రియ అది. మన ఆలోచనకు మించిన చోటుకి వెళ్లి, అక్కడి మనుషులను చేరుకోవడం అన్నమాట. అలాంటి సినిమాలు తీయాలన్నది నా ఆకాంక్ష’’ అంటున్నారు నిత్యా మీనన్‌. బాలనటిగా 1998లో కెరీర్‌ ఆరంభించి, ఆ తర్వాత ఓ పదేళ్లు పలు భాషల చిత్రాల్లో నటించారామె.

 ‘అలా మొదలైంది’ (2011)తో తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు నిత్యా మీనన్‌. ఇన్నేళ్లుగా మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ వంటి భాషల్లో కథానాయికగా సినిమాలు చేస్తూ వస్తున్నారు నిత్యా మీనన్‌. ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. సొంత బేనర్‌కి ‘కేయూరీ ప్రొడక్షన్స్‌’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు నిత్యా మీనన్‌.

 ‘‘మనుషులు చేయలేని అద్భుతాలను సినిమాలు సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన సినిమాలు చేయాలని నటిగా నా కెరీర్‌ మొదలుపెట్టినప్పుడే అనుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా నా ఆలోచన అదే. సమాజాన్ని ప్రభావితం చేసే కథలు తెరపైకి తీసుకురావాలన్నది నా లక్ష్యం. కథకు, పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలే ఈ బేనర్‌ నుంచి వస్తాయి’’ అని నిత్య పేర్కొన్నారు. అయితే ఈ బేనర్‌పై నిర్మించ నున్న తొలి సినిమా గురించిన వివరాలేమీ ఆమె తెలియజేయలేదు.    
 

Advertisement
 
Advertisement
Advertisement