
ఆదిమానవుల నేల... శిలా శాసనాల ఖిల్లా గజ్వేల్
వర్గల్ శంభుని గుట్టపై చిహ్నాలు
గుట్ట పరిసరాల్లోరాక్షస గూళ్లు
మానవ పరిణామ క్రమానికి గీటురాయి
యుగాలు, తరాలు మారినా, శాస్త్ర సాంకేతిక పురోగతి రాకెట్ వేగంతో దూసుకెళుతున్నా.. ఆనాటి మానవుని మనోభావాలు, శిలా శాసనాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి విశేషాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం నిలయంగా మారుతోంది. ఈ ఆధారాలు మానవ వికాస పరిణామక్రమానికి ఎల్లలు లేవనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలోని ఆదిమానవుల చారిత్రక విశేషాలు, శిలాశాసనాల ప్రత్యేకతలపై ఈ వారం కథనం. – గజ్వేల్ /వర్గల్(గజ్వేల్)
గజ్వేల్ నియోజకవర్గంలో రెండో బాసరగా విశేష ఆదరణ కలిగిన చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్ శంభుని కొండ గుహలు, నాడు ఆదిమానవుల నెలవులుగా విలసిల్లిన ఆనవాళ్లు ఉన్నాయి. వర్గల్ గ్రామానికి ఆగ్నేయ దిశలో ఎత్తైన కొండల శిఖరాగ్రాన శ్రీవిద్యాసరస్వతి అమ్మవారి సన్నిధానం ఎడమ పక్కన పెద్ద బండరాయి ఉన్నది. ఈ రాయి అడుగున ఎరుపు రంగులో అర్థం కాని భాషలో నాడు ఇక్కడ ఆవాసమున్న ఆదిమానవులు లిఖించినట్లు చెప్పబడుతున్న అక్షరాలు నేటికీ కనిపిస్తున్నాయి.
గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’
శంభుని కొండ పరిసరాల్లో బృహత్ శిలాయుగపు నాటి ఆది మానవుల సమాధులుగా చెప్పుకునే ‘రాక్షస గూళ్లు’ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మధ్యన సమాధి.. దాని చుట్టూ గుండ్రంగా, వృత్తాకారంలో పెద్ద పెద్ద బండలతో పేర్చినట్లు కని్పస్తాయి. వర్గల్‌కు నైరుతి దిశలో అటవీ ప్రాంతంతో కూడిన తుని్కఖాల్సా గ్రామ సమీపంలో పెద్ద సంఖ్యలో ‘రాక్షస గూళ్లు’ నాటి చరిత్రకు అద్దం పడుతున్నాయి.
చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్‌మెంట్..త్వరలో పెళ్లి
పలు గ్రామాల్లో శిలా శాసనాలు
వర్గల్ మండలంలో రాజుల నాటి శాసనాలు కూడా ఉన్నాయి. వర్గల్‌లో మూల స్థాన ఆలయానికి క్రీస్తు శకం 970లో కొంత భూమిని అప్పటి రాజులు దానంగా ఇస్తున్నట్లు పేర్కొంటూ కన్నడ భాషలో దాన శిలా శాసనం చెక్కించారు. అలాగే సీతారాంపల్లిలో క్రీస్తు శకం 979 నాటి శిలాశాసనం ఉన్నది. దాదాపు 5 ఫీట్ల ఎత్తున్న శిలపై నాలుగు దిక్కులా కన్నడ భాషలో అక్షరాలు చెక్కించారు. వేలూరు గ్రామ పటేల్ చెరువు పూడిక తీత పనుల్లో బయటపడిన దీనిని గ్రామ కూడలిలో స్థాపించారు.
గజ్వేల్ ప్రాంతంలోని కొండపాక రుద్రేశ్వరాలయ ప్రతిష్ట, ఆలయ నిర్వహణకు భూ దానం అంశాన్ని వివరిస్తూ నాడు కాకతీయ రుద్రదేవుడి కాలంలో క్రీ.శ.1194 వేయించిన శాసనమున్నది.
అలాగే ఐతేశ్వర సోమనాథ ఆలయానికి సంబంధించి ఒకే శిలపై కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలం నాటి రెండు శాసనాలున్నాయి.
మర్కూక్ మండలం పాములపర్తి పటేల్‌చెరువు వద్ద క్రీ.శ.1148 నాటి దానశాసనంను గుర్తించారు. అదేవిధంగా ఇటిక్యాలలో మూడు పక్కల తెలుగు, ఒక వైపు సంస్కృత శ్లోకంతో కూడిన శాసనం కనపడుతుంది.
చారిత్రక సంపదను సంరక్షించుకోవాలి
పురాతన శాసనాలకు, చారిత్రక సంపదకు గజ్వేల్ నియోజకవర్గం నెలవు. అందుకు సంబంధించి అనేక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడి ప్రాచీన చారిత్రక, పురాతత్వ, శిల్ప కళాసంపదలు కాలగర్భంలో కలిసిపోకముందే పరిరక్షించి భావితరాలకు అందజేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – డాక్టర్ హరినాథ్‌శర్మ రిటైర్డ్ ప్రభుత్వ తెలుగు శాఖాధిపతి