సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్‌..!! | Indias Population Growth Will Come To An End | Sakshi
Sakshi News home page

సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్‌..!!

Published Fri, Sep 15 2023 12:00 PM | Last Updated on Thu, Sep 21 2023 8:56 PM

Indias Population Growth Will Come To An End - Sakshi

సాక్షి న్యూస్‌: "ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ.. ఆలజాతికిన్ తిన్నది పుష్టి.." అన్నారు తిరుపతి వెంకటకవులు ఓ పద్యనాటకంలో. మానవుడికి చేతిలో, వంట్లో, ఇంట్లో ఉన్నదే పుష్టికిందకు వస్తుంది. జంతువులకు అప్పటికప్పుడు తిన్నదే పుష్టి. కాబట్టి మానవుడు పుష్టిని సుష్టుగా సంపాయించుకొని ఉండాలన్నది సారాంశం. "ధాతు పుష్టి - వీర్యవృద్ధి సమృద్ధిగా ఉండాలి" అని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి పదే పదే చెబుతుండేవాడు. తగ్గిపోతున్న సంతాన ఉత్పత్తిని చూస్తుంటే.. ఇవన్నీ గుర్తుకు రాక మానవు. అసలు విషయానికి వద్దాం.

జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్న చైనాకు మనం దాదాపుగా సమానంగా వచ్చేశాం. త్వరలో ఆ దేశాన్ని కూడా అధిగమించి, మొదటి స్థానానికి భారత్ చేరుకుంటుందని కొన్నాళ్ళుగా సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా, జనాభా తగ్గుముఖం పడుతోందనే వార్తలు కొత్త ఆలోచనలను రేకేత్తిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ పరంగా, భారతదేశం అతి పెద్దది. అందుకనే అమెరికా, చైనా వంటి అగ్రదేశాల కళ్ళన్నీ మన పైనే ఉన్నాయి. మానవవనరుల సేవా రంగంలో భారతీయుల స్థానం విశిష్టమైనది. సమాచార సాంకేతిక రంగాల్లోనూ మనదే పై చేయి.

ప్రగతి ప్రయాణంలో చైనాతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి వున్నాం. జనాభాతో పాటు ఆర్ధికంగానూ బలమైనదిగా ఎదిగి,ఉత్పాదకత, పనిసంస్కృతిలోనూ చైనా ముందంజలో ఉంది. జాతి ఎదుగుదలలో,దేశ ప్రగతిలో మనిషి పాత్ర చాలా గొప్పది. అష్ట ఐశ్వర్యాలలో సంతానం కూడా ఒకటిగా భారతీయులు విశ్వసిస్తారు. అందుకే ఒకప్పుడు ఎక్కువమందికి జన్మనివ్వడంపై మక్కువ చూపించేవారు. క్రమంగా ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం దృష్ట్యా సంతానోత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు.

ముగ్గురు లేదా ఇద్దరు,ఇద్దరు లేదా ఒక్కరూ అని మొదలై, చివరికి ఒక్కరే ముద్దు అనే ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టింది. 'చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం'.. అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. ఈ క్రమంలో, 2019-2021లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకూ నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. 2015-16లో 2.2శాతంగా ఉండేది. 1998-99లో ఈ రేటు 3.2గా ఉండేది. అంటే? భారతీయ మహిళ సగటున ముగ్గురికి జన్మనిచ్చేది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో సంతానోత్పత్తి సగటు కంటే కూడా తక్కువగా నమోదవుతోంది.

కుటుంబ నియంత్రణ సాధనాల వాడకం కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో 54 శాతం ఉండేది. ప్రస్తుతం 67 శాతాన్ని దాటిపోయింది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితులు,శారీరక దృఢత్వం తగ్గుతూ రావడం, లేటు వయస్సు పెళ్లిళ్లు, సౌందర్యం /గ్లామర్ తగ్గుతుందనే భయం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై పోవడం మొదలైనవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ మన సంఘ సంస్కర్తలు ఎందరో ఎన్నో ఉద్యమాలు చేపట్టారు.

ఆ దురాచారాన్ని దూరం చేయడానికి ఎంతో కృషి చేశారు.కానీ అది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. వివాహ బంధాలు,ప్రేమ పెళ్లిళ్లు కూడా కలకాలం నిలవడం లేదు. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి ఇవన్నీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 1950 ప్రాంతంలో, భారతీయ మహిళ సగటున ఆరుగురికి (5.9) జన్మనిచ్చేది. జనాభా పెరుగుదల వల్ల పోటీ పెరగడం, సదుపాయాలు తగ్గిపోవడం,వనరుల కొరత, అధిక ధరలు, డిమాండ్ - సప్లై మధ్య భారీ వ్యత్యాసం మొదలైన దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి.

మహిళలలో అక్షరాస్యత పెరగడం తద్వారా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడంలో ఈ అంశాలు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మానవ వనరుల సద్వినియోగం జరగకుండా, కేవలం జనాభా పెరగడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. పేదరికాన్ని తగ్గించాలన్నా, అభివృద్ధిని సాధించాలన్నా, జనాభా ఉత్పత్తిలో సమతుల్యతను సాధించడమే శ్రేయస్కరం. శారీరక,మానసిక పటుత్వం సాధన దిశగా దృష్టి సారించడం అంతకుమించి అవసరం.మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

(చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement