
ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్ జనరల్ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్‌తో నిండిపోయింది ఎక్స్.
మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్ జనరల్‌గా ఒక ఇండియన్ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు ఎక్స్‌లో కామెంట్లు గుప్పించారు.
ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్‌కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్‌ఫెక్ట్ అభ్యర్థి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్ చేశారు.
మథుర శ్రీధరన్.. ఎమ్‌ఐటీ (మాసచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్‌గ్రాడ్యూయేట్. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది.