ఢిల్లీ: కోల్‌కతా ఐప్యాక్ కార్యాలయం ఘటన కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలకు దిగింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని.. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల వినిపించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం దీనిని తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి?. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్లు.. అధికారుల ఫోన్లను లాక్కున్నారు. ఆధారాలను దొంగింలించారు. ఆ సమయంలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆమె వెంట ఉన్నారు. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారు. కోల్‌కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారు. హైకోర్టలో మా తరఫు లాయర్‌ను వాదించకుండా అడ్డుకున్నారు. కోర్టు హాల్‌లో ఆయన మైక్ కట్ చేశారు అని సోలిసిటర్ జనరల్ వాదించారు. అయితే..
సోదాలు జరిపేందుకు రెండేళ్లు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని కోల్‌కతా ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఈ హడావిడి ఎందుకు? అని ప్రశ్నించింది. అయితే.. సోలిసిటర్ జనరల్ వాదనలను నిశితంగా విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్‌కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా? అని వ్యాఖ్యానించింది. ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి. కేసు మొత్తాన్ని సమగ్రంగా విచారణ జరపాలి అని అభిప్రాయపడింది.
జనవరి 8వ తేదీన కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంతో పాటు ఢిల్లీలోని నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు.. కోల్‌కతా ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ అంటోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన ‘ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రై.లి.’కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అయితే.. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు. అయితే ఈడీ తమ విధులకు ఆమె ఆటంకాలు కల్పించారని కోర్టును ఆశ్రయించగా.. మరోవైపు బీజేపీ రాజకీయంగానూ విమర్శలకు దిగింది.


