
దీనిపై ఏమంటారు?: ‘ఎక్స్’ను ప్రశ్నించిన కేంద్రం
కర్నాటక హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు
బెంగళూరు: సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ‘సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్నాటక’పేరుతో ఫేక్ అకౌంట్‌ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా క్రియే ట్ చేసినట్లు సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా చెప్పారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రమాదకరమైన ధోరణులకు ‘ఎక్స్’సైతం వేదికగా మారిందని తెలిపారు. సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ కార్పొరేషన్‌తో కేంద్రం విభేదాలు కొనసాగుతున్న వేళ శుక్రవారం కర్నాటక హైకోర్టులో వాదనల సందర్భంగా ఎస్‌జీ తుషార్ మెహతా దీనిని ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.
ప్రజలను సులువుగా మోసం చేసేందుకు సామాజిక మాధ్యమ వేదికలను దుర్వినియోగం చేసేందుకు ఎంతో అవకాశముందని వివరించారు. ‘నేను ఈ అకౌంట్ క్రియేట్ చేశాను. ఎక్స్ ఈ అకౌంట్‌ను ధ్రువీకరించింది కూడా. నేనిక ఇందులో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. జనం సైతం సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్నాటక ఇలా చెప్పి ఉంటుందనే నమ్ముతారు’అంటూ మెహతా వాదించారు.
దుర్వినియోగం తీవ్రతను చూపేందుకు తప్ప, కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఈ అకౌంట్‌ను క్రియేట్ చేయలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వచ్చే కంటెంట్‌కు జవాబుదారీతనం లేదనటానికి ఇదో ఉదాహరణ అని వాదించారు. ఫలానా సమాచారాన్ని తొలగించాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎక్స్ కార్పొరేషన్ వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేంద్రం తరఫున తుషార్ మెహతా ఈ లోపాన్ని ఎత్తి చూపారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం మాత్రమే సంబంధిత కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించొచ్చని ఎక్స్ కార్పొరేషన్ వాదించింది.