
గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సుధామూర్తికి ఫోన్‌కాల్ సంఘటన
నారాయణమూర్తిగారి కోసం అనుకొని ‘రాంగ్ కాల్’ అని చెప్పిన సుధామూర్తి
విషయం తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు
సుధామూర్తి ‘ఐటీ డివైడ్' కాలమ్‌ను అబ్దుల్ కలాం చదివేవారట
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.
Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4
— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024
విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు.
అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు.
కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.