తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది.
మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు.
ఫిట్‌నెస్ ప్రతీకగా..
ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్‌రావు, డాక్టర్ ప్రవీణ్‌మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్‌పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు.
ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్‌రావు వీరికి కెపె్టన్‌గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
(చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..)


