ఒక వయసు వచ్చాక మహిళల్లో గర్భధారణలు పూర్తిగా ఆగిపోవడానికి చిహ్నంగా రుతుక్రమం ఆగడమన్నది చాలా సాధారణం. ఇలా పీరియడ్స్ రావడం ఆగిపోవడాన్ని డాక్టర్లు ‘మెనోపాజ్’గా చెబుతుంటారు. హార్మోన్ల మార్పులతో ఇలా మెనోపాజ్ ఆగడానికి ముందుగా మహిళల్లో చాలా రకాల ప్రతికూల లక్షణాలు కనిపిస్తుంటాయి. అందులో ఒంటి నుంచి వేడి ఆవిర్లు వస్తుండే హాల్ ఫ్లషెస్, మూడ్స్ త్వరగా మారిపోతూ ఉండటం (మూడ్ స్వింగ్స్), పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే ముందు క్రమబద్ధంగా రాకపోవడం (ఇర్రెగ్యులర్ పీరియడ్స్)... ఇవన్నీ సాధారణం. అయితే వీటితోపాటు ‘బ్రెయిన్ ఫాగ్’ అనే లక్షణం కూడా చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు... ఈ లక్షణాన్ని మెనోపాజ్‌కు సంబంధించినది కాకపోవచ్చంటూ కొందరు అయోమయానికి గురికావడం కూడా సహజమంటున్నారు. మెనోపాజ్‌కు ముందర నిశ్శబ్దంగా వచ్చే ఈ ‘బ్రెయిన్‌ఫాగ్’ వివరాలేమిటో సవివరంగా చూద్దాం.!.
నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది గతంలో కరోనా వైరస్ విజృంభించాక... కోవిడ్–19 తాలూకు అనంతర దీర్ఘకాలిక దుష్ప్రభావాలలో ఒకటిగా చెబుతూ వెలుగులోకి వచ్చింది. ఈ ‘బ్రెయిన్ ఫాగ్’ దశలో మెదడు అయోమయానికి గురికావడం, మనసుకు మబ్బులు పట్టినట్లుగా మందకొడిగా ఉండి΄ోవడం, ఆలోచనల్లో స్పష్టత లేకుండా ఉండటం, ఏదీ స్పష్టంగా అనిపించక΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో మంచు బాగా కమ్మినప్పుడు చూడటానికి ఎదుటి దృశ్యం గోచరించడంలో ఉండే అస్పష్టతలాగానే... మనసుకు లేదా మెదడుకు అదే మంచు ఆవరిస్తే ఆలోచనల్లో, భావాల్లో ఎలాంటి అయోమయంగా / అస్పష్టతతో ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ బ్రెయిన్ ఫాగ్ అనే పదం ఉపకరిస్తుంది.
ఎందుకిలా జరుగుతుందంటే...
రుతుస్రావం ఆగి΄ోయే ముందుగా మహిళల్లో స్రవించే చాలా రకాల హార్మోన్లు... వీటిల్లోనూ మరీ ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ్ర΄ోజెస్టరాన్ వంటివి బాగా తగ్గడంతో హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడుతుంది. ఇవి కేవలం ప్రత్యుత్పత్తి కోసమే కాకుండా మెదడు సరిగా పనిచేయడంలో కూడా బాగా ఉపకరిస్తుంటాయి. ఉదాహరణకు ఈస్ట్రోజెన్ అన్న హార్మోన్ మెదడులోని నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ నెరపుతుంటుంది. అలాగే మెదడులో స్రవించే రసాయనాలైన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిట్టర్లు తమ బాధ్యతలను నెరవేర్చడంలోనూ ఈస్ట్రోజెన్ తగిన భూమికను పోషిస్తుంది.
ఈ హార్మోన్ తగ్గడంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు ఆగడం ఎలాగూ జరిగేదే అయినా దాంతోపాటు మెదడులోని కార్యకలా΄ాలూ ప్రభావితమవుతాయి. దాంతో మెదడు ఆకృతిలో కూడా కొంతలో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంటుందని ఆధునిక శాస్త్రపరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రంటల్ కార్టెక్స్, హిపోక్యాంపస్ వంటివి ఉన్న చోటు నుంచి కాస్తంత పక్కకు జరగడం వంటివి. ఈ కారణంగా కొందరు మహిళల్లో వారి జ్ఞాపకశక్తిపైనా అలాగే మూడ్స్‌లో మార్పుల పైనా ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
నిద్రపైనా దుష్ప్రభావాలు...
ఈ బ్రెయిన్‌ఫాగ్ తాలూకు దుష్ప్రభావాలు మెనోపాజ్ వచ్చిన మహిళల నిద్రపైనా పడతాయి. దాంతో వాళ్లు తరచూ నిద్రాభంగానికి గురవుతుండటం జరుగుతుంది (ఒంట్లోంచి ఆవిరులు వస్తుండే హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు తీవ్రంగా చెమటలు పట్టే నైట్ స్వెట్టింగ్ వంటి లక్షణాలు కూడా మహిళల్లో నిద్రలేమి కారణమవుతుంటాయి). ఈ నిద్రలేమి తిరిగి మళ్లీ మెదడును మందకొడిగా చేయడానికి కారణమవుతుంటుంది.
చికిత్స...
బ్రెయిన్‌ఫాగ్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న మహిళలకు వాళ్లలో తగ్గిన హార్మోన్లను భర్తీ చేసే ‘హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ’తో లక్షణాలు అదుపులోకి వస్తాయి. అయితే వాళ్ల సమస్యలకు ఇతరత్రా వేరే కారణాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) ఇస్తారు.
బ్రెయిన్‌ఫాగ్‌లో కనిపించే లక్షణాలు...
∙దేనిపైనా ఏకాగ్రత నిలవకపోవడం లేదా ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది కలగడం.
మనుషుల, ప్రదేశాల పేర్లూ, కొన్ని పదాలు ఠక్కుమని స్ఫురించక΄ోవడం లేదా మరచిపోవడం. మనం చేయాల్సిన పనులు, తదుపరి షెడ్యూల్స్ మరచిపోతూ ఉండటం.
తీవ్రమైన నిస్సత్తువ లేదా బాగా మందకొడిగా అనిపించడం.
సాఫీగా ఆలోచింకలేకపోవడం, మునపటిలా కాకుండా ఏదైనా ఆలోచనల్లో స్పష్టత వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి రావడం.
అధిగమించడం ఎలా...
మెనోపాజ్‌లో కనిపించే ఈ బ్రెయిన్‌ఫాగ్‌ను అధిగమించడానికి మంచి జీవనశైలి బాగా ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర΄ోవడం, మంచి గాఢమైన, నాణ్యమైన నిద్రతోనూ, అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి సమతులాహారంతోనూ, క్రమంతప్పకుండా చేసే వ్యాయామాలతో పాటు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా కాలం గడుపుతూ, తమను తాము బిజీగా పెట్టుకుంటూ నిత్యం మంచి పుస్తకాలు చదవడం, గళ్లనుడికట్టు లేదా క్లిష్టమైన పజిల్స్ సాధించడం లాంటి ‘మెంటల్ ఎంగేజ్‌మెంట్’ కార్యకలాపాలతో గడపడం వల్ల ఈ తరహా బ్రెయిన్‌ఫాగ్ లక్షణాలు చాలావరకు తగ్గుతాయి.
మతిమరపు వస్తుందా అన్నంత ఆందోళన...
బ్రెయిన్‌ఫాగ్ తాలూకు ఈ లక్షణాలతో మెనోపాజ్ దశలో మహిళలకు తమకు మతిమరపు గానీ లేదా అలై్జమర్స్‌గానీ వస్తున్నాయా అంటూ తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. అయితే అదృష్టవశాత్తూ ఇవేవీ అలై్జమర్స్‌లాంటి తీవ్రమైన మతిమరపులాంటి సమస్యలను తెచ్చిపెట్టవన్నది వైద్య నిపుణుల మాట. అంతేకాదు... బ్రెయిన్‌ఫాగ్‌తో కనిపించే ఈ లక్షణాన్నీ చాలావరకు తాత్కాలికమేనంటున్నారు.
(చదవండి: అమ్మ పాలతో అదనంగా...కాంప్లిమెంటరీ ఫుడ్‌గా..!)


