చిన్నారులకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఇతర ఆహారాలేవీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్నెల్ల వయసు దాటాకే చిన్నపిల్లలకు ఘనాహారం ఇవ్వడం మంచిదని అనేక అధ్యయనాలూ, నిపుణులూ సిఫార్సు చేస్తున్నారు. ఆర్నెల్లు దాటాక పిల్లలకు క్రమంగా ఘనాహారానికి మార్చే ప్రక్రియలో తల్లిపాలతోపాటు కొద్దికొద్దిగా ఆహారాన్ని ఇచ్చే క్రమంలో వారికి పెట్టే మెత్తటి గుజ్జులాంటి ఫుడ్‌ను ‘కాంప్లిమెంటరీ ఫుడ్’గా చెప్పవచ్చు. అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం.
కాంప్లిమెంటరీ ఆహారం గురించి ఇటీవల మార్కెట్‌లో యాడ్స్ ద్వారా ప్రచారాలూ, వాణిజ్యపరమైన
హడావుడి ఎక్కువగా ఉంటున్నాయి. తమ కంపెనీ ఆహారం వల్ల ఎదిగే పిల్లలకు మంచి పౌష్టికత లభిస్తుందంటూ ఈ తరహా అడ్వరై్టజ్‌మెంట్స్‌లో చెబుతుంటారు. నిజానికి కాంప్లిమెంటరీ ఆహారం అంటే... తల్లిపాలతోపాటు ఆర్నెల్ల వయసు నుంచి పిల్లలకు అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం అని చెప్పవచ్చు. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమనగానే అదేదో తప్పనిసరిగా మార్కెట్‌లో కొని చిన్నారులకు తినిపించాల్సిన ఆహారమంటూ పొరబడాల్సిన / అపోహపడాల్సిన అవసరం లేదు.
ఘనాహారంలో ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఇలా...
ఘనాహారంలో భాగంగా పిల్లలకు మెత్తగా ఉడికించిన అన్నం (రైస్), పప్పులు (దాల్), అరటిపండు గుజ్జుగా చిదిమి ఇవ్వాలి. ఆలూ వంటి ఉడకబెట్టిన కూరగాయలూ మెత్తగా చిదిమి పెట్టవచ్చు. ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి చిన్నారులకు కాచి చల్లార్చిన నీళ్లు పడుతూ ఉండాలి. అంతేతప్ప వాణిజ్య ప్రయోజనాలతో మార్కెట్‌లో లభ్యమయ్యే ఆహారాన్నే ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఏ మోతాదులోనంటే...
పైన చెప్పిన ఆహారాన్ని ఆర్నెల్ల వయసు నుంచి రోజూ 150 ఎమ్‌ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు కూడా తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక...
మెత్తగా చిదిమిన ఇడ్లీ లేదా రోటీ కాస్తంత గట్టిగా వండిన పప్పుతో ఇవ్వవచ్చు. ఇక రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొప్పాయి వంటి పండ్లను చిదిమి ఆహారంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ ఆహారం కిందికే వస్తాయి.
కాంప్లిమెంటరీ ఆహారం ఎలా ఉండాలంటే...
పిల్లల కడుపుకు నప్పేదీ, సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను బట్టి వారు భరించగలిగేంత (అఫర్డ్ చేయగలిగేంత) చవకగా దొరికేదని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడంటే దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా చెబుతున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. అయితే ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభిప్రాయం.
నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ్త ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడాన్ని కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసప్పటి నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో ఇరుక్కోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీల వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనుబంధ ఆహారాన్ని ఆలస్యం ఇవ్వడం మొదలుపెడితే అది వాళ్ల పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అయితే... ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. అది భవిష్యత్తులో వాళ్లను ఎన్నో జబ్బుల నుంచి దూరం చేస్తూ... ఆ పిల్లలకు పెద్దవయసు వచ్చాక కూడా రక్షణ ఇస్తూనే ఉంటుంది.
హరిత శ్యామ్ .బి సీనియర్ డైటీషియన్
(చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!)


