నా మొండి భర్తను మార్చగలరా! | Health Tips: How to Deal With a Stubborn Partner Can He Change | Sakshi
Sakshi News home page

నా మొండి భర్తను మార్చగలరా!

Jun 26 2025 7:57 AM | Updated on Jun 26 2025 8:44 AM

Health Tips: How to Deal With a Stubborn Partner Can He Change

నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్‌కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్‌ కూడా అయింది. హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్‌ మెదలుపెట్టారు. ఆఫీస్‌కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్‌లో రిహాబిలిటేషన్‌ సెంటర్లో జాయిన్‌ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.

– పద్మలత, కాజీపేట 

మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్‌కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్‌ అడిక్షన్‌కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. 

మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్‌ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్‌ ఇంటర్వ్యూయింగ్‌ పద్ధతులు వాడతాము. 

ఒకసారి మోటివేషన్‌ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్‌ రిలాప్స్‌’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్‌ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. 

అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్‌ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్‌ వర్కర్లు, యోగ థెరపిస్ట్‌ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ !

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ విజయవాడ
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ sakshifamily3@gmail.com)

(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్‌ లవ్‌ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement