ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి | Health and Parental Provider Malluru Narasimhaswamy at Warangal | Sakshi
Sakshi News home page

ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి

Jan 16 2025 10:44 AM | Updated on Jan 16 2025 11:30 AM

Health and Parental Provider Malluru Narasimhaswamy at Warangal

హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్‌ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. 

వరంగల్‌ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.

ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.

ఆరోగ్యామృతం ఆ నీరు
ఇక స్వామివారి   పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. 

ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.

ఎలా చేరుకోవాలి?
ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్‌  నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

– భాస్కర్‌
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement