
పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా వెనుకడుగు వేయలేదు. అజేయంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదవడమే కాకుండా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే టీచర్ అయ్యాడు. చేతులు లేకపోయినా..పిల్లలకు బోధించే విధానాన్ని చూస్తే.. ఎవ్వరి మనసైనా హత్తుకుంటుంది. ఓ గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.
జార్ఖండ్‌లోని దట్టమైన అడువుల మధ్యలో గుల్షన్ లోహార్ అనే ఉపాధ్యాయుడు ఆ యువ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేని ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు బ్లాక్‌బోర్డుపై రాస్తూ బోధిస్తున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. పైగా ఆ విద్యార్థుల్లో స్ఫూర్తిని కూడా నింపుతోంది.
ఆయన ఎప్పుడు తన వైకల్యాన్ని అడ్డంకి కూడా చూడలేదు. చాలామంది ఇలా రెండు చేతులు లేకపోవడాన్ని శాపంగా చూస్తే..అదే తన బలంగా మార్చుకున్నాడాయన. అతడి ఎడ్యుకేషన్ జర్నీ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లోహార్ రోజు 74 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్లేవాడట.
తల్లి, సోదరుడు, అడగడుగునా సాయం అందించేవారట. బీఈడీ డిగ్రీకి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పూర్తి చేసినట్లు తెలిపారు. అలా టీచర్ ఉద్యోగం పొందాక..మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు అంతగా ఉపాధ్యాయులెవరు ఆసక్తి చూపరు కానీ లోహార్ అలాంటి పాఠశాలలనే ఎంచుకుంటారు. ఆయన పశ్చిమ సింగ్‌భూమ్‌లోని మారుమూల అడవులలో ఉన్న బరంగ గ్రామం పాఠశాల అనేక విద్యా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాంటి పాఠశాలకు టీచర్‌గా రావడమే కాకుండా పాఠాలు చెప్పే తీరు ఓ రేంజ్‌లో ఉంటుంది
గణితాన్ని బోధించేందుకు తన కాలినే చేతిగా మార్చుకుని చెబుతున్న విధానం చూస్తే..చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.ఎందుకంటే దాన్ని భోధించాలంటే నోటితో సాధ్యం కాదు తప్పనిసరిగా బ్లాక్‌బోర్డుపై రాయక తప్పదు. తన వైకల్యాన్నే సవాలు చేసేలా చిన్నారులకు చెబుతున్న తీరు చూస్తే..మాష్టారు మీరు గ్రేట్ అని ప్రశంసించకుండా ఉండలేరు.
అందుకు అతడి భార్య అంజలి, కూతురు సాయం అందిస్తారుట. అంతేగాదు అతడి సేవలను జార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కౌన్సిల్ గుర్తించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అర్హుడని అభివర్ణించింది. అయితే లోహార్ మాత్రం వైకల్యం అనేది నేర్చుకోవడానికి, బోధనకు అడ్డంకి కాదు అని చెప్పాలనేదే తన ఆకాంక్ష అని చెబుతున్నాడు.
(చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!)