
పావురాలు ఎక్కువగా కాసింత నీలిఛాయ కలగలసిన బూడిద రంగులో ఉంటాయి. తెల్ల పావురాలు కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పావురాలు గోధుమరంగులో ఉంటాయి. ఇంకొన్ని ఇవన్నీ కలగలసిన రంగుల్లో ఉంటాయి. వీటికి భిన్నంగా చిలకపచ్చ రంగులో ఉన్న పావురం ఒకటి ఇటీవల ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్ పట్టణంలో కనిపించి, స్థానికులను అబ్బురపరచింది.
ఈ అరుదైన పావురాన్ని చూడగానే కొందరు ఔత్సాహికులు దీనిని తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొద్ది వారాలుగా ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ వీథుల్లో మిగిలిన పావురాల గుంపుతో కలసి చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కువగా నార్తాంప్టన్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రాంగణంలోను, ఆ పరిసరాల్లోని వీథుల్లో ఉన్న ఇళ్ల వద్ద కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కొందరు దీని వీడియోలను ‘టిక్‌టాక్’లో పోస్ట్ చేస్తే, అవి వైరల్‌గా మారాయి. మొదటిసారిగా ఈ పావురాన్ని తన ఇంటి ముందున్న తోటలో జూన్ 28న చూసినట్లు రాబిన్ హింక్‌మాట్ అనే స్థానికులు చెప్పారు. ఆయన దీని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు స్థానికులు కూడా దీని ఫొటోలు, వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టారు. మొత్తానికి ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
(చదవండి: ప్రాణం తీసిన ఫ్లాస్కు)