ఫండే
స్నాక్ సెంటర్
రొయ్యల కూరలో కొబ్బరి పాల రుచి.. బాసుందీలో సీతాఫలం తీపి.. బేద్మీ పూరీలో మసాలాల ఘుమఘుమలు! ఈ మూడు వంటకాలు మీ భోజనాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. మరి వాటి తయారీ విధానం ఎలానో చూద్దాం!
గోవా ప్రాన్ కర్రీ
కావలసినవి..
రొయ్యలు: 500 గ్రాములు,
కొబ్బరి తురుము: కప్పు,
కొబ్బరి పాలు: కప్పు,
ఉల్లిపాయ: అర కప్పు,
టొమాటో: అర కప్పు,
పచ్చిమిర్చి: 2,
చింతపండు గుజ్జు: 2 టీ స్పూన్లు,
కొబ్బరి నూనె: 3 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: తగినంత,
పసుపు: అర టీ స్పూన్,
నిమ్మరసం: టేబుల్‌స్పూన్,
మసాలా కోసం– ధనియాలు: టేబుల్‌స్పూన్,
జీలకర్ర: టీ స్పూన్,
ఎండు కశ్మీరీ మిరపకాయలు: 8,
వెల్లుల్లి రెబ్బలు: 6,
మిరియాలు: టీ స్పూన్,
లవంగాలు: టీ స్పూన్,
దాల్చిన చెక్క: చిన్న ముక్క.
తయారీ..
ముందుగా శుభ్రం చేసిన రొయ్యలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
కొబ్బరి తురుము, మసాలా దినుసులన్నింటినీ కలపి కొద్దిగా నీటితో మెత్తని మసాలాగా రుబ్బుకోవాలి.
పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి రొయ్యలను 2–3 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టాలి.
అదే పాన్ లో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించాలి.
తర్వాత టొమాటో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు రుబ్బిన మసాలా, ఒక కప్పు నీరు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కలపాలి.
మూతపెట్టి తక్కువ మంటపై పది నిమిషాలు ఉడికించాలి.
మసాలా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు, వేయించిన రొయ్యలు వేసి మరో 2–3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపాలి. అంతే రుచికరమైన గోవా ప్రాన్ కర్రీ సిద్ధం.
సీతాఫల్ బాసుందీ..
కావలసినవి..
పాలు: లీటర్,
సీతాఫలం గుజ్జు: ముప్పావు కప్పు,
చక్కెర: పావు కప్పు,
ఏలకుల పొడి: అర టీ స్పూన్,
బాదం, పిస్తా: అలంకరణకు.
తయారీ..
ముందుగా సీతాఫలం నుంచి గుజ్జును తీసుకోవాలి.
గుజ్జు నుంచి గింజలను తొలగించి, గుజ్జును మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత మందపాటి గిన్నెలో పాలను పోసి మధ్య మంటపై మరిగించాలి.
పాలు సగానికి తగ్గే వరకు తరచూ కలుపుతూ ఉడికించాలి.
పాలు సగానికి తగ్గిన తర్వాత చక్కెర, ఏలకుల పొడి వేసి మరో 3–4 నిమిషాలు మరిగించాలి.
స్టవ్ ఆపి, పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత సీతాఫల్ గుజ్జు వేసి బాగా కలపాలి.
కొన్ని గంటలు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. చివరగా బాదం, పిస్తాతో అలంకరిస్తే రుచికరమైన సీతాఫల్ బాసుందీ సిద్ధం.
బేద్మీ పూరీ..
కావలసినవి..
మినప్పప్పు: కప్పు,
గోధుమపిండి: 3 కప్పులు,
సన్నని రవ్వ: 2 టేబుల్‌స్పూన్లు,
అల్లం: చిన్న ముక్క,
పచ్చిమిర్చి: 3,
సోంపు పొడి: 2 టీ స్పూన్లు,
ధనియాల పొడి: టీ స్పూన్,
కారం: టీ స్పూన్,
ఆమ్‌చూర్ పొడి: టీ స్పూన్,
ఇంగువ: చిటికెడు,
ఉప్పు: తగినంత,
నూనె: తగినంత.
తయారీ..
మినప్పప్పును ఒక ఆరుగంటల పాటు నానబెట్టి నీరు వంపేయాలి.
అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా నీరు వేసి, మరీ జారుగా కాకుండా ముద్దలా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమంలో గోధుమపిండి, రవ్వ, ఉప్పు, సోంపు, ధనియాల పొడి, కారం, ఆమ్‌చూర్, ఇంగువ, కొద్దిగా నూనె వేసి కలపాలి.
అవసరమైనంత నీరు పోస్తూ పిండి గట్టిగా కలుపుకుని, దాదాపు అరగంటసేపు పక్కన ఉంచాలి.
తర్వాత చిన్న ఉండలుగా చేసి, మామూలు పూరీ కంటే కాస్త మందంగా ఒత్తుకోవాలి.
వీటిని బంగారు రంగు వచ్చే వరకు నూనెలో వేయించాలి. వేడివేడిగా ఆలూ కూరతో అందిస్తే రుచికరమైన బేద్మీ పూరీ సిద్ధం.
ఇదీ చదవండి: వంట నేర్చుకునే బుజ్జాయిలకై.. ఈ క్యూట్ గాడ్జెట్స్ ఓ లుక్కేయండి!


