ఒక పుస్తకం.. ఒక హత్య.. పోలీసులకు చిక్కిన భయంకర నిజం! | Funday Crucial Story On Number 30 Murder Mystery | Sakshi
Sakshi News home page

ఒక పుస్తకం.. ఒక హత్య.. పోలీసులకు చిక్కిన భయంకర నిజం!

Oct 25 2026 11:59 AM | Updated on Oct 25 2026 11:59 AM

Funday Crucial Story On Number 30 Murder Mystery

ఫండే

క్లూషియల్‌

హైదరాబాద్‌ శివార్లలో అదొక విలాసవంతమైన బంగ్లా. ఆ బంగ్లాలో ఎప్పుడూ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ రోజు ఉదయం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు జీప్‌ సైరన్‌ మోగింది. బంగ్లా యజమానురాలు మార్గరెట్‌ తన పడకగదిలో విగతజీవిగా పడి ఉంది. ఆ బంగ్లా చూసుకోవడానికి అరవై ఏళ్లు పైబడిన దండపాణి అనే కేర్‌ టేకర్‌ మాత్రమే ఉన్నాడు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారం మార్గరెట్‌ అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల చనిపోయింది. పైకి చూస్తే అదొక స్పష్టమైన ఆత్మహత్యలా కనిపిస్తోంది. 
కానీ ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు దృష్టి ఘటనా స్థలంలో ఉన్న ఒక వస్తువుపై పడింది. చనిపోయే ముందు మార్గరెట్‌ చేతిలో ఒక పుస్తకం గట్టిగా పట్టుకుని ఉంది.

ఆ పుస్తకం పేరు ‘స్టోరీ నం 30’. అందులో ముప్పై కథలున్నా, విచిత్రంగా అది రివర్స్‌ ఆర్డర్‌లో ప్రింట్‌ అయ్యి ఉంది. అంటే 30వ కథ మొదటి పేజీలో మొదలై, 1వ కథ చివరి పేజీలో ముగుస్తుంది. మిగతా 29 కథలకు పేర్లు ఉన్నాయి కానీ, మొదటి పేజీలో ఉన్న 30వ కథకు మాత్రం ఎలాంటి పేరు లేదు. ఆ కథ ముగింపులో పుస్తక రచయిత కార్తికేయ ఆటోగ్రాఫ్‌ ఉంది.

హత్యా రహస్యం ఆ పుస్తకంలోనే ఉందని నమ్మిన అభిమన్యు, నేరుగా రచయిత కార్తికేయను కలిశాడు. అక్కడ కార్తికేయ చెప్పిన విషయాలు విన్నాక అభిమన్యు కళ్లలో ఒక స్పష్టత, పెదవులపై ఒక చిన్న నవ్వు కనిపించాయి.
అక్కడినుంచి నేరుగా బంగ్లాకు చేరుకున్నాడు ఇన్‌ స్పెక్టర్‌. దండపాణిని హాల్లో కూర్చోబెట్టి తలుపులు మూయించాడు. గదిలో లైట్లు ఆర్పేసి, కేవలం దండపాణి ముఖం మీద మాత్రమే ఒక చిన్న లైట్‌ పడేలా చేశాడు. తన జేబులోంచి ఒక పాతకాలపు పాకెట్‌ వాచ్‌ తీసి దాని గొలుసు పట్టుకుని దండపాణి కళ్ల ముందు అటూ ఇటూ ఊపడం మొదలుపెట్టాడు.

‘దండపాణీ... నా చేతిలో ఆడుతున్న ఈ గడియారాన్ని మాత్రమే చూడు... నీ మనసు ప్రశాంతంగా మారుతోంది... నీ శరీరంలో బరువు తగ్గుతోంది... నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే నువ్వు సమాధానం చెబుతావు...’ అంటూ అభిమన్యు గంభీరమైన స్వరంతో లయబద్ధంగా మాట్లాడుతున్నాడు.

ఆ వాతావరణానికి, ఆ వాచ్‌ కదలికలకు దండపాణి ముఖంలో చెమటలు పట్టాయి. కళ్లు తేలేస్తూ, తీవ్రమైన కంగారుతో వణికిపోవడం మొదలుపెట్టాడు. అతడి కంగారును గమనించిన అభిమన్యు టక్కున వాచ్‌ ఆపేసి, టేబుల్‌ మీద గట్టిగా కొట్టాడు.
‘మార్గరెట్‌ను ఇలాగే హిప్నటైజ్‌ చేసి అధిక మాత్రలు మింగేలా చేశావు కదా మిస్టర్‌ దండపాణి... అలియాస్‌ శివరాం!’ అని అభిమన్యు గర్జించేసరికి దండపాణి గుండె ఆగినంత పనైంది. ‘శివరాం’ అనే తన అసలు పేరు ఇన్‌స్పెక్టర్‌కు ఎలా తెలిసిందా అని బిత్తరపోయాడు.

‘ఏంటి... నీ గతం గురించి నాకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా?’ అంటూ అభిమన్యు అసలు కథ విప్పాడు.
‘ఆ స్టోరీ నం 30 పుస్తక రచయిత కార్తికేయ నాకు మొత్తం చెప్పాడు. ఆ 30వ కథ ఒక నమ్మక ద్రోహం గురించి. ఒక హిప్నాటిస్ట్, తన విద్యతో ఒక వ్యక్తిని ట్రాన్‌ ్సలోకి పంపి, అధిక మోతాదులో మందులు తీసుకునేలా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడమే ఆ కథ. మార్గరెట్‌ నిన్న సాయంత్రమే రచయితను కలిసి ఆ కథ చదివిన తర్వాత తనకు ఒక నిజం అర్థమైందని చెప్పింది.

తన కేర్‌ టేకర్‌ దండపాణి అప్పుడప్పుడు తనను తెలియకుండానే ట్రాన్స్‌లోకి తీసుకువెళ్తున్నాడని గుర్తొచ్చిందని, ఆ కథే తన ప్రాణాలు కాపాడబోతోందని చెప్పి ఆటోగ్రాఫ్‌ తీసుకుంది. పూర్వాశ్రమంలో ఒక హిప్నాటిస్ట్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన శివరాంవే నువ్వు!’

అభిమన్యు మాటలకు దండపాణికి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది.
‘మార్గరెట్‌ రచయితను కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఫాలో అయ్యావు. రచయిత కార్తికేయ ఇంటి ముందు... ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్లో నీ విజువల్స్‌ రికార్డు అయ్యాయి.

నీ బండారం బయటపడిందని అర్థమై, ఆ రాత్రే ఆమెను హిప్నటైజ్‌ చేసి, ఆ కథలో ఉన్నట్లుగానే నిద్రమాత్రలు తీసుకునేలా చేశావు. కానీ చనిపోయే ముందు ఆమె ఆ పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని, హంతకుడు నువ్వే అన్న క్లూ నాకు వదిలి వెళ్ళింది.’
నేరం రుజువు కావడంతో దండపాణి అలియాస్‌ శివరాం తలదించుకున్నాడు.

మరుసటి రోజు అభిమన్యు మళ్ళీ కార్తికేయను కలిశాడు. ‘క్రైమ్‌ కథలు అంటే నేరం ఎలా చేయాలో ఐడియాలు ఇవ్వడం కాదు, క్రిమినల్స్‌ను ఎలా పట్టుకోవాలో కూడా చూపించాయి అనడానికి మీ స్టోరీ నం 30 అసలైన ఉదాహరణ. దయచేసి ఆ 30వ కథకు ‘నమ్మక ద్రోహం’ అనే పేరు పెట్టి మీ పుస్తకాన్ని సెకండ్‌ ఎడిషన్‌ రిలీజ్‌ చేయండి.’ అని చిరునవ్వుతో చెప్పాడు అభిమన్యు.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: వయసు వెనక్కి వెళ్లే వరం.. హిమస్విని రాసిన చివరి లేఖ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement