వయసు వెనక్కి వెళ్లే వరం.. హిమస్విని రాసిన చివరి లేఖ! | Ravana Boon Himashwini Mysterious Letter Written By Malladi Venkata Krishna Murthy | Sakshi
Sakshi News home page

వయసు వెనక్కి వెళ్లే వరం.. హిమస్విని రాసిన చివరి లేఖ!

Oct 25 2026 11:45 AM | Updated on Oct 25 2026 11:45 AM

Ravana Boon Himashwini Mysterious Letter Written By Malladi Venkata Krishna Murthy

ఫండే

కథాకళి

ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అవి బయటకి రావు.
∙∙ 
నా భార్య సమ్మర్‌ వెకేష¯Œ కి డల్‌హౌసీకి వెళ్దామని కోరింది.
‘‘హోటల్‌ ఒద్దు. కలోనియల్‌ హౌస్‌ తీసుకోండి. బ్రిటిష్‌ కాలంలో కట్టిన హిస్టారికల్‌వి అక్కడ చాలా ఉంటాయి.’’ కోరింది.
ఆ ప్రకారం మేము ముందు ఢిల్లీకి, అక్కడ నుంచి డల్‌హౌసీకి చేరుకుని రిజర్వ్‌ చేసుకున్న ఏర్‌బీఎ¯Œ బీకి వెళ్ళాము. ఆ ఇంటిని బయట నుంచి చూడగానే బ్రిటిష్‌ కాలంలో తెల్లదొరల కోసం కట్టారని తెలిసిపోతోంది. లోపల ప్రతి గదిలోని ఫైర్‌ ప్లేస్‌లని, టీక్‌ వుడ్‌తో చేసిన తలుపులు, ఫర్నిచర్‌ని చూశాక అది రూఢి ఐంది.

ఆ ఇంటిని హేండ్‌ ఓవర్‌ చేయడానికి వచ్చిన స్థానికుడు గదులన్నీ చూపించాడు. కింద డ్రాయింగ్‌ రూమ్, కిచెన్, డైనింగ్‌ హాల్‌. స్టడీ రూమ్‌. డ్రాయింగ్‌ రూమ్‌లో గోడలకి చేత్తో గీసిన చిత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ అనేక వయసుల్లోని ఒకే మహిళవి. వృద్ధాప్యంలోని చిత్రంలో ఆవిడ చర్మం రంగుని బట్టి ఇండియన్‌ అని తెలిసిపోతోంది.

‘‘ఈవిడ పేరు మిసెస్‌ హిమస్విని. బ్రిటిష్‌ వారి కాలంలో తన ఇంగ్లిష్‌ భర్తతో ఈ ఇంట్లో ఉండేవారు. కొంత కాలానికి ఆయన లండన్‌ వెళ్ళిపోయారు. భార్యని తీసుకెళ్ళలేదు. ఆవిడ మనవడి మనవడు ఇప్పుడు దీనికి వారసుడు. అతను లండ¯Œ లో ఉన్నాడు.’’
‘‘ఆవిడని ఖననం చేశారా? దహనం చేశారా?’’ చిత్రంలో ఆవిడ మొహం మీది బొట్టుని చూసి మా ఆవిడ అడిగింది.

‘‘రెండూ చేయలేదు.’’
‘‘ఆవిడ పార్సీనా? మృతదేహాన్ని సైలెంట్‌ టవర్‌ మీద పక్షులకి ఆహారంగా ఉంచారా?’’
‘‘కాదు. ఆవిడ మాయమైంది.’’
‘‘మాయమైందా?’’ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘ఆవిడ ఒంటరిగా ఉండేది. కొడుకు ఇంగ్లండ్‌కి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. ఈ ఇంట్లో ఎవరెవరో ఆడవాళ్ళు ఉండేవారు. చివరిగా ఓ చిన్న పిల్ల ఉండేది. ఆ అమ్మాయిని చూసుకోడానికి ఓ భయంకర వ్యక్తి ఉండేవాడు. తర్వాత మళ్ళీ ఈ ఇంట్లోకి ఎవరూ రాలేదు. 

‘‘ఆవిడ రావణాసురుడి భక్తురాలు. ఆవిడ పూర్వీకులు కూడా. నవరాత్రుల్లో ఆవిడ తప్పనిసరిగా కాన్పూరు సమీపంలోని షివాలా ప్రాంతంలోని దశానన్‌ ఆలయానికి వెళ్ళేది. దాన్ని కేవలం విజయదశమి రోజే తెరుస్తారు. మిగిలిన రోజులన్నీ మూసే ఉంటుంది. రావణాసురుడి మరణానికి బాధపడుతూ అక్కడ మౌనంగా ధ్యానం చేస్తారట. ఆవిడ ఎప్పుడు మాయమైందో ఎవరికీ తెలీదు.’’ ఆ స్థానికుడు చెప్పాడు.

మా ఆవిడ ఆ రాత్రి స్టడీ రూమ్‌లోని బుక్‌ షెల్ఫ్‌లని చూస్తూ, ఓ దానికి తాళం లేకపోవడం గమనించి, దాన్ని తెరిచి ఆర్‌.ఈ. ఎంథోవెన్‌ రాసిన ‘ఓల్డ్‌ మెన్‌ ఎట్‌ పీపుల్స్‌ ట్రీ’ పుస్తకాన్ని తీసుకుంది. దాంట్లోంచి ఓ కాగితం నేల మీద పడింది. ఒంగి తీసుకుని నాలుగు మడతలు పెట్టిన దాన్ని తెరిచి చూసింది. అది సిమెంట్‌ రంగులో, గొగ్గులుగా ఉన్న ఓ పాత లెటర్‌ హెడ్‌. ఆవిడ పేరుతో, ఆ అడ్రస్‌తోనే దాన్ని ముద్రించారు. ఏటవాలుగా వాలిన ఇంగ్లీష్‌ అక్షరాల్లో, చిన్న పిల్ల చేతిరాతతో రాసిన దానికి ‘సో దట్‌ యు నో’ అనే హెడ్డింగ్‌ ఉంది.

నేను టీవీ చూస్తూంటే, దాన్ని కొద్దిగా చదివి వెంటనే వచ్చి నా పక్కన కూర్చుని టీవీని ఆఫ్‌ చేసి మా ఆవిడ బయటకి చదివింది.
‘‘ఇది వినండి. నేను రావణుడి భక్తురాలిని. నా ఎనభై ఆరవ ఏట నేను ఇంకాస్త ముసలిదానిని ఐతే మొహం, చేతులు బాగా ముడతలు పడతాయని మథనపడేదాన్ని. ఓ రోజు రావణ విగ్రహానికి పూజ చేశాక ఆయన ప్రత్యక్షమయ్యాడు. అబద్ధం కాదు, ఇది నిజం. ఆయన స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అచ్చం దశానన్‌ ఆలయంలోని విగ్రహంలోలానే ఉన్నాడు. ఆ విగ్రహాన్ని వందల ఏళ్ళుగా, చాలా తరాలుగా మేము విడవకుండా నిత్యం ఆరాధిస్తున్నాం. ఆయన వాత్సల్యంగా నా తల నిమిరి అడిగాడు. ‘నువ్వు ఇంకొన్ని సంవత్సరాల్లో వృద్ధురాలుగా మరణిస్తావా? లేక వయసులో వెనక్కి వెళ్తూ చివరికి మాయమవుతావా?’

‘వయసులో వెనక్కి వెళ్ళడం అంటే?’ అడిగాను.
‘నీ ప్రతీ పుట్టినరోజుకి నీ వయసు పెరిగే బదులు ఒక్కో సంవత్సరం తరుగుతూంటుంది. ఇలా ఎనభై ఆరో ఏట నించి ఒకటవ ఏడు దాకా నువ్వు వెనక్కి వెళ్తూ, చివరికి పుట్టని మనిషివి అవుతావు’
‘అప్పుడు నాకు యవ్వనం తిరిగి వస్తుందా?’ ఆశగా అడిగాను.
‘యవ్వనం, తర్వాత బాల్యం కూడా వస్తుంది. ఈ రహస్యం ఎవరికి చెప్పినా, ఈ వరం నష్టమై అసలు వయసుకి చేరుకుంటావు’ ఆయన హెచ్చరించాడు.

నేను ఆ వరాన్ని కోరుకున్నాను. క్రమంగా నేను ఏటా వార్ధక్యంలోంచి వెనక్కి వస్తున్నానని గుర్తించాను. ప్రపంచంలో  రెండోసారి యవ్వనాన్ని అనుభవించింది నేనే. ఇప్పుడు నా వయసు ఐదు. ఇంకో నాలుగేళ్ళల్లో నేను పుట్టని మనిషిలా మాయమవుతాను. కాబట్టి నా ఆరాధ్య దైవం రావణాసురుడి వరం గురించి ప్రపంచానికి తెలియాలని ఈ ఉత్తరం రాసి పుస్తకంలో ఉంచుతున్నాను. మీరు ఇది నమ్మడానికి ఋజువుగా, నేను ఈ ఇంట్లో వివిధ వయసుల్లో జీవించినప్పుడు గీయించుకున్న వర్ణ చిత్రాల్లోని తారీకులని చూడండి.’’
ఉత్తరం చివరలో చిన్న పిల్ల చేతిరాతలో హిమస్విని అని సంతకం ఉంది.

వెంటనే మేమిద్దరం చిత్రాల్లోని తారీకులని చూస్తే, వృద్ధాప్యంలో గీసిన చిత్రం 1917. ఆఖరి చిత్రం 2000. అప్పుడు ఆమె వయసు నాలుగు.
∙∙ 
అవును. ప్రపంచంలో మనకి తెలీని ఎన్నో వింతలు ఉన్నాయి. అవి బయటకి రావు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఇదీ చదవండి: కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement