కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం! | Shankara Kurup First Jnanpith Award Winner | Sakshi
Sakshi News home page

కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

Oct 25 2026 11:36 AM | Updated on Oct 25 2026 11:51 AM

Shankara Kurup First Jnanpith Award Winner

ఫండే

లిట్‌వరల్డ్‌

‘అంతుబట్టని నీలాకాశపు
అగాధాలలోకి పతనమయ్యా–
పడుతూ, పడిపోతూ
అపస్మారకస్థితిలోకి జారిపోయా–
పాలవెలుగులను వెదజల్లే
నిప్పుకణికగా మారిపోయా!

నిజమే–
నింగి కడలిలో, నేనో పిత్తపరిగనే!

ఒకనాటికి,  
కాలం కవిలెకట్టలో
మరపున, మరుగున పడిపోతానేమో!!  

అయితే, నేనూ ఒకప్పుడు,
బతుకు కొలిమిలో బొగ్గునై
భగ్గుమన్నదాన్నే!

నా మాట నమ్ము!
నేనూ ఓ వెలుగు వెలిగి,
వెలిగించిన దాన్నే!!’
అనే ఈ అత్యాధునిక కవితా ఖండికను వెలువరించిన మలయాళ మహాకవి, విమర్శకుడు, వ్యాసకర్త గోవింద కురుప్‌ శంకర కురుప్‌. ఇరవయ్యో శతాబ్దితో పాటే పుట్టిన ఈ మహాకవి, అరవై అయిదో యేట జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి రచయిత.

పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో యువకవిగా ‘ప్రకృతికో వందనం’ సమర్పించిన శంకర కురుప్, మరో అయిదేళ్ళకు ‘సాహిత్య కౌతుకం’ పేరిట తొలి కవితాసంకలనాన్ని వెలువరించారు. 1918–78 సంవత్సరాల మధ్య కాలంలో శంకర కురుప్‌ 40 పుస్తకాలు ప్రచురించారు. మొదట్లో భావకవిగా ఉండిన శంకర కురుప్‌ క్రమంగా ఆన్ని సాహిత్య దృక్పథాలనూ అధ్యయనం చేస్తూ, తనకంటూ ఓ సాహిత్య మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఆ క్రమంలో భాగంగానే, కవికులగురువు కాళిదాసు రాసిన ‘మేఘదూతం’, పారశీక మహాకవి ఉమర్‌ ఖయ్యాం పాడిన ‘రుబాయత్‌’, రవీంద్ర కవీంద్రుడు గానంచేసిన ‘గీతాంజలి’ తదితర అనువాద గ్రంథాలను మలయాళ పాఠకులకు సమర్పించుకున్నారు కురుప్‌.

సాహిత్య లోకం కూడా ఆయన్ను అంతే ఆప్యాయంగా ఆదరించింది. 1961లో కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారంతోనూ, 1963లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారంతోనూ, 1965లో జ్ఞానపీఠ పురస్కారంతోనూ, 1967–68 సంవత్సరాల్లో పద్మభూషణ్‌ పురస్కారంతోనూ, 1967లో సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ పురస్కారంతోనూ ఈ మహాకవిని సత్కరించింది అక్షర జగతి. వీటన్నిటికీ తలమానికమనిపించేలా 1968లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు శంకర కురుప్‌.

శంకర కురుప్‌ కలం పట్టేనాటికి, మన దేశభాషలు అన్నింటిలోనూ ప్రచురంగా విస్తరిస్తున్న రచనా ధోరణి భావకవిత్వం అనే రొమాంటిసిజం. అప్పట్లో కవిత్వమే ప్రధాన రచనా ప్రక్రియగా ఓ వెలుగు వెలుగుతూ వుండేది. అందుకే, 1920 దశకానికి అటూయిటూగా  రచయితలనందరినీ కవులనే అనేవారు.  (నూరేళ్ళ తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని నిలబెట్టిన రంగం ఒక్కటే– అది సినిమా రంగం! నిన్నమొన్నటి వరకూ సినిమా వాళ్ళ భాషలో అన్నిరకాల రచయితలూ కవులే!!) శంకర కురుప్‌ క్రమంగా దివి నుంచి  భువికి దిగివచ్చి సమగ్ర మానవతావాదానికి పట్టంకట్టిన రచయిత కాగలిగారు.

19–20శతాబ్దాల్లో రచయితగానూ, సామాజిక ఉద్యమకారుడిగానూ మలయాళ సమాజాన్ని ప్రభావితం చేసిన వల్లత్తోళ్‌ నారాయణ మేనన్‌ ప్రభావం శంకర కురుప్‌పై ప్రగాఢంగా పడింది. అది ఆయన సామాజిక దృక్పథాన్ని తీర్చిదిద్దింది. షెల్లీ, వర్డ్స్‌వర్త్, టాల్‌స్టాయ్, టాగోర్ల సాహిత్యమూ– గాంధీ గారి రాజకీయాలూ రచయితగా ఆయన దృక్పథాన్ని ప్రభావితం చేశాయి.

ముఖ్యంగా, రష్యన్‌ మహారచయిత టాల్‌స్టాయ్‌ రచన ‘కళ అంటే ఏమిటి?’ చదివిన తర్వాత ఆయన సాహిత్య దృక్పథం విస్పష్ట రూపం తీసుకుందంటారు. 1897లో టాల్‌స్టాయ్‌ ఈ 200 పేజీల సిద్ధాంత గ్రంథాన్ని రష్యనులో రాశారు. మరో ఏడేళ్ళకు గానీ– అంటే, 1904లో గానీ– ఐల్మర్‌ మాడ్‌ దాన్ని ఆంగ్లంలోకి అనువదించలేదు. అది జరిగిన ఏ మూడు నాలుగు దశాబ్దాలకో మన మలయాళ మహాకవి దాన్ని చదివి వుంటారు.

అయితేనేం? టాల్‌స్టాయ్‌ చెప్పిన అయిదారు సూత్రాలు మనకు తెలిసిన మహాకవిని నగిషీలు చెక్కి తీర్చిదిద్దాయి! సాహిత్యకళలో సౌందర్యాన్ని– వినోదాత్మకతనూ– శిల్ప ప్రావీణ్యాన్ని ప్రముఖంగా పరిగణించే దురాచారాన్ని టాల్‌స్టాయ్‌ తీవ్రంగా ఖండించారు. సిసలైన కళలోని భావుకత, దాని స్వీకర్తకు ‘వైరస్‌ మాదిరిగా సోకాలి’ అన్నారు టాల్‌స్టాయ్‌. నిజమైన కళకు సార్వజనికమైన స్వభావం ఉండాలనీ, అది అందరికీ అందుబాటులో ఉండాలనీ కూడా అన్నారాయన.

అత్యున్నతమైన కళారూపం విశ్వజనీనమైన సోదరభావాన్నీ, ప్రేమాభిమానాలనూ రేకెత్తించాలన్నారాయన. కేవలం ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉండే కళ కృతకమైందని ఖండించారు టాల్‌స్టాయ్‌. శంకర కురుప్‌ సాహిత్య మూర్తిమత్వంలో టాల్‌స్టాయ్‌ ‘బోధనల’ జాడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంటాయి!

శంకర కురుప్‌ స్వయంకృషిని మాత్రమే నమ్ముకున్న వ్యక్తి. పాఠశాలలో చదువుకున్నవి మలయాళ– సంస్కృత సాహిత్యాలే అయినా, కష్టపడి ఇంగ్లిష్, హిందీ, బంగాలీ భాషలనూ నేర్చారు. ఆయా భాషల్లో మూల రచనలు చదివిన కారణంగానే, శంకర కురుప్‌ స్వరం అంతటి స్పష్టతనూ– గాంభీర్యాన్నీ సంతరించుకోగలిగింది. పారశీక భాష ఆయన నేర్చుకోకపోయినా, ఆంగ్లానువాదాల ద్వారా మధ్యయుగాల పారశీక కవుల రచనలను శంకర కురుప్‌ నిశితంగా అధ్యయనం చేశారు.

ఆయన రాసిన వ్యాస సంపుటి ‘ముత్యాలూ– ముత్తెపుచిప్పలూ’లో వినిపించే స్వరగాంభీర్యం గురించి మలయాళ విమర్శకులు తరచు ప్రస్తావిస్తూ వుంటారు. అలాంటి వ్యక్తికి మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం దక్కినందుకు 61 సంవత్సరాల తర్వాత కూడా మనం సంతోషించాలి.

- మందలపర్తి కిషోర్‌

ఇదీ చదవండి: ప్లీజ్‌ మేల్కోండి..ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ విషయంలో అశ్రద్ధ వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement