ఫండే
ఫ్యాషన్
ట్రెండీమెన్
అసలు ఏమాత్రం స్టయిలింగ్ గురించి తెలియక తల పట్టుకునే మగాళ్లకు, మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కాపాడే ఒక చిన్న ఫ్యాషన్ సూత్రం ఇప్పుడు మీకోసం... అదే ఈ మూడు రంగుల మంత్రం! ఈ చిన్న టిప్ ఫాలో అయితే, ఇక అందంగా కనిపించాలని, అల్మరా ముందు గంటల తరబడి నిలబడి ఆలోచించే పనే ఉండదు.
ఒక ఔట్‌ఫిట్‌లో ప్రధానంగా మూడు రంగులకే చోటివ్వడం ఈ రూల్ సూత్రం. ఇక్కడ ఒక రంగు లుక్‌కు పునాది వేస్తే, రెండోది దానికి అందమైన తోడవుతుంది. మూడోది మాత్రం తక్కువగా కనిపిస్తూనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే, స్టయిల్ విషయంలో ఈ మూడురంగులూ మంచి మిత్రులు అన్నమాట!
దేని వాటా ఎంత!
మూడు రంగులూ స్టయిలింగ్ విషయంలో కలిసే ఉన్నప్పటికీ, సమానా వాటా ఇస్తే గొడవలైపోతాయి. ఎందుకంటే, ఇక్కడ ఒక రంగు బాధ్యత తీసుకుంటే, మరో రంగు సహకరిస్తుంది. ఇంకొకటి స్మాల్ స్పార్క్‌లా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. కాబట్టి, వీటి పనుల ఆధారంగా ఈ మూడు రంగులకూ స్టయిలింగ్ నిష్పత్తి 60–30–10 ఉండేలా పంచాలి.
మెయిన్ హీరో:
మొదట ఔట్‌ఫిట్‌లో అధిక భాగాన్ని ఆక్రమించే ప్రధాన రంగుకి అరవై శాతం ఇవ్వాలి. ప్యాంటు, సూట్ లేదా జాకెట్ వంటి దుస్తులకు ఈ రంగును ఎంచుకోవచ్చు. నేవీ బ్లూ, బేజ్, గ్రే వంటి రంగులు ఇందుకు చక్కగా సరిపోతాయి. అప్పుడే మిగతా రంగులన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి!
సపోర్టింగ్ స్టార్:
ప్రధాన రంగుకు తోడుగా నిలుస్తూ మీ అందానికి కీలక పాత్ర పోషించే ఈ రంగుకి ముప్పై శాతం. షర్టు, టీషర్టు లేదా లేయిరింగ్ దుస్తుల్లో దీనికి చోటివ్వొచ్చు. ఉదాహరణకు నేవీ బ్లూ ప్యాంటుకు తెల్లటి షర్టు– సింపుల్‌గా ఉన్నా స్టయిల్ మాత్రం సూపర్!
అసలైన ట్విస్ట్:
ఔట్‌ఫిట్‌కు హైలైట్ ఇచ్చే చిన్న రంగే మీ స్టయిలింగ్‌లో అసలైన ట్విస్ట్. వాచ్ స్ట్రాప్, టై, పాకెట్ స్క్వేర్ లేదా షూస్‌లకు ఈ రంగును జోడించవచ్చు. అయితే బెల్టు, షూస్ ఒకే రంగులో ఉన్నాయంటే వాటిని విడివిడిగా రెండు రంగులుగా లెక్కించాల్సిన అవసరం లేదు. రంగుల లెక్క కంటే మొత్తం లుక్ పొందే శాతమే ముఖ్యం!
గుర్తుంచుకోండి, 60–30–10 అనేది కచ్చితంగా కొలిచి పాటించాల్సిన ఫార్ములా కాదు. ఇది రంగుల మధ్య సమతుల్యతను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే మార్గదర్శకం మాత్రమే. ఇలా ఫ్యాషన్ కోసం కొత్త కొత్త రంగుల దుస్తులు కొనడం కంటే, ఉన్న వాటితో తెలివిగా కలిపే రంగుల కలయికే ఎక్కువ ఆకర్షణను తీసుకొస్తుంది.
- కొండి దీపిక
ఇదీ చదవండి: ఒక పుస్తకం.. ఒక హత్య.. పోలీసులకు చిక్కిన భయంకర నిజం!


