
దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్‌లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.
మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది.
దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్‌లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్‌లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.
చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు బ్రాండ్ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి. బల్క్ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు కో–ప్రాసెసర్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి గెజిట్–నోటిఫైడ్ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.
రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్ స్పోర్ట్స్ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్‌లలో వాహనాలను నడపడం రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి.
కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్..
(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..)