నీలం రాము
అనగనగా ఒక అడవిలో చెరువు ఒడ్డున ఒక వేప చెట్టు మీద ఒక కోతమ్మ ఉండేది. ఆ చెట్టు మీదకు కొత్తగా ఒక కాకమ్మ వచ్చి ముళ్లపుల్లలు, చెట్టుబెరడు, జంతువుల వెంట్రుకలు, గడ్డి మొక్కలు తీసుకొచ్చి అందమైన గూడు కట్టింది. కోతమ్మ, కాకమ్మతో స్నేహం చేసింది.ఒక రోజు కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టింది. మరునాడు కాకమ్మ లేనప్పుడు ఒక కోకిలమ్మ నెమ్మదిగా కాకమ్మగూటిలో దూరి రెండు గుడ్లు పెట్టింది. కోతమ్మ అది గమనించింది. ‘అక్కా! నన్ను క్షమించు! నాకు గూడు కట్టుకోవటం రాదని నీకు తెలుసుకదా! అందుకే కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టాను!’ అంది కోకిలమ్మ.
కోతమ్మ మాట్లాడలేదు. కాకమ్మ తిరిగి గూటికి వచ్చింది. దానికి మరో రెండు గుడ్లు కనిపించాయి. చుట్టూ చూసింది. ఏ పక్షీ కనిపించలేదు. తనగుడ్లతో పాటు వాటినీ పొదిగి పిల్లల్ని చేసింది.కోతమ్మకు కాకమ్మ పిల్లలు నల్లగా, అందవిహీనంగా కనిపించాయి. వాటిని ముట్టుకోటానికే అసహ్యం కలిగింది.చెట్టు కింద చెరువులో నీళ్లు తాగడానికి కొంగమ్మ, చిలకమ్మా, నెమలమ్మ వచ్చాయి.
అది చూసిన కాకమ్మ చెట్టు దిగి కిందికి వెళ్లి తన అందమైన బిడ్డలను చూడవలసిందిగా కోరింది. ‘నీ పిల్లలకి తెల్ల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది కొంగ.
‘ఆకుపచ్చ ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది చిలుక.
‘పోనీ.. రంగు రంగుల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది నెమలి.
అప్పుడు ‘నా పిల్లల అందం మీలా వర్ణించలేను. చూస్తే మీకే తెలుస్తుంది!’ అంది కాకమ్మ..
కొంగమ్మ, చిలకమ్మా , నెమలమ్మలు కాకమ్మ గూటికి వెళ్లి చూశాయి.
పిల్లలు కాకమ్మలా నల్లగా కనిపించాయి.
కాకమ్మను బాధ పెట్టకుండా, పిల్లలు తన పోలికతో, బూడిదరంగు ఈకలతో ముద్దుగా ఉన్నాయని దీవించి వెళ్లాయి. అవి వెళ్లగానే ‘అక్కా! ఇంత అందమైన పిల్లలు ఏ ప„ì కైనా పుట్టాయా?’ కోతమ్మతో అంది కాకమ్మ.
‘నాకు తెలీదు! రేపు కొంగమ్మ, చిలుకమ్మ, నెమలమ్మ ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసి రా.. పో!’ అంది.తెల్లారి కాకమ్మ మొదట కొంగమ్మ గూటికి వెళ్ళింది. గూటిలో రెండు పిల్లలు కనిపించాయి. మెరిసే తెల్లటి, గోధుమ రంగు ఈకలు, పొడవాటి కాళ్లు, పొడవాటి మెడ, కొనతేలిన ముక్కు, గుండ్రటి పెద్ద కళ్లతో ముచ్చటగా ఉన్నాయి.కాకమ్మ అక్కడి నుంచి చిలకమ్మ గూటికి వెళ్ళింది.చిలకమ్మ ఇద్దరి పిల్లలు కూడా ఆకు పచ్చటి ఈకలతో, ఎర్రటి ముక్కుతో, గుండ్రటి పెద్ద కళ్లతో ఆకర్షణగా కనిపించాయి.ఆ తర్వాత అక్కడ నుంచి నెమలి ఇంటికి పోయింది.
నెమలి పిల్లలు కూడా గోధుమ ఈకలు, చిన్న కాళ్లు, పదునైన ముక్కుతో, అందంగా కనిపించాయి.కాకి తిరిగి వేపచెట్టు దగ్గరికి వచ్చింది.కోతమ్మ ఆసక్తిగా కాకి కళ్లలోకి చూస్తూ.
‘చెల్లీ! కొంగమ్మ, చిలకమ్మ, నెమలమ్మ పిల్లలు ఎలా ఉన్నాయి’ అడిగింది.
‘అక్కా! నా బిడ్డల అందం మాత్రం వాటికి లేదు!’ అంది కాకమ్మ.
ఇంతలో కోకిలమ్మ వచ్చి కొమ్మపై వాలింది.
‘చెల్లీ! నా పిల్లల్ని చూసి పోదువురా!’ అంటూ కోకిలమ్మను గూటిలోకి ఆహ్వానించింది కాకమ్మ.
‘అక్కా! పిల్లలు ముద్దొస్తున్నారు!’ అంటూ కోకిలమ్మ గూటిలోని నాలుగు పిల్లల్ని ముద్దాడింది. బిడ్డలు ఎలా ఉన్నా, తల్లికి అందంగానే కనిపిస్తారు. కానీ పరాయి బిడ్డల్ని కూడా తన బిడ్డలుగా పెంచే కాకమ్మ మనసు అందంగా కనిపించింది. కాకమ్మ పిల్లలు కూడా ఎంతో అందంగా, ముద్దుగా కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకుని ముద్దాడింది కోతమ్మ.


