ఈ సండే సూపర్‌ వెరైటీ స్నాక్స్‌ ట్రై చేయండిలా..! | Funday Special Food Recipies: How To Make Different Way Snaks | Sakshi
Sakshi News home page

ఈ సండే సూపర్‌ వెరైటీ స్నాక్స్‌ ట్రై చేయండిలా..!

Jun 15 2025 4:43 PM | Updated on Jun 15 2025 4:43 PM

Funday Special Food Recipies: How To Make Different Way Snaks

కోల్‌కతా పెయారా చాట్‌

కావలసినవి:  జామకాయ(పెయారా)– 2 (మంచి దోరకాయలు ఎన్నుకోవాలి, చిన్నచిన్నగా కట్‌ చేసుకోవాలి)
పచ్చిమిర్చి– 3
అల్లం– ఒక చిన్న ముక్క
కొత్తిమీర తరుగు– పావు కప్పు
ఉప్పు– తగినంత
చాట్‌ మసాలా– అర టీస్పూన్‌
కారం, పంచదార– ఒక టీస్పూన్‌ చొప్పున
ఆవాల పేస్ట్‌– 2 టీస్పూన్లు
నిమ్మరసం– ఒక టీ స్పూన్‌

తయారీ: ముందుగా మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోసిన జామకాయ ముక్కలు వేసుకుని, అందులో పచ్చిమిర్చి–కొత్తిమీర పేస్ట్, చాట్‌ మసాలా, కారం, పంచదార, ఆవాల పేస్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కావాలంటే కాస్త జోడించి, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కకు మసాలా బాగా పట్టేలా చేసుకుని తింటే ఈ చాట్‌ చాలా బాగుంటుంది.


నూడుల్స్‌ టొమాటో కప్స్‌
కావలసినవి:  టొమాటో– 6 (పైభాగం కొద్దిగా కట్‌ చేసుకుని, లోపలి గుజ్జు తొలగించి బౌల్‌ / కప్పు మాదిరి చేసుకోవాలి)
గుడ్లు– 4 (అన్ని గుడ్లు ఒక బౌల్‌లో వేసుకుని, కొద్దిగా పాలు కలుపుకుని బాగా బీట్‌ చేసుకోవాలి)
మోజెరెల్లా చీజ్‌ తురుము– 100 గ్రాములు
ఉప్పు – తగినంత
మిరియాల పొడి– ఒక టీ స్పూన్‌
కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)
ఉల్లికాడ ముక్కలు– ఒక టేబుల్‌ స్పూన్‌
నూడుల్స్‌– గార్నిష్‌కి
తయారీ: ముందుగా ప్రతి టొమాటో కప్‌లో కొన్ని ఉల్లికాడ ముక్కలు, కొద్దిగా చీజ్‌ తురుము వేసుకుని, కొద్దికొద్దిగా గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర తురుము వేసి ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. బేక్‌ అయిన తర్వాత నూడుల్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే, ఇవి భలే రుచిగా ఉంటాయి.

టర్కిష్‌ బక్లావా
కావలసినవి:  సిరప్‌ కోసం
పంచదార– 200 గ్రాములు
నీళ్లు– సరిపడా, నిమ్మరసం– ఒక టేబుల్‌ స్పూన్‌
బక్లావా కోసం
ఫిలో షీట్స్‌ – కొన్ని (ఇవి చపాతీల్లానే ఉంటాయి కానీ చాలా పలుచగా పూతరేకుల్లా ఉంటాయి. ఇవి మార్కెట్‌లో దొరుకుతాయి. ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుని గుత్తగా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు. ఉపయోగించుకునే ముందు రూమ్‌ టెంపరేచర్‌లో ఉంచితే అవి ఈజీగా విడిపోతాయి. మైదా పిండి, గుడ్లతో ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు.) బటర్‌ – 225 గ్రాములు, పిస్తా, వాల్‌నట్‌ – 200 గ్రాములు (మిక్సీ పట్టుకోవాలి, ఇక గార్నిష్‌కి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ పౌడర్‌ తీసుకోవచ్చు)

తయారీ: ముందుగా పంచదార, నీళ్లు, నిమ్మరసం కలిపి బౌల్‌లో వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించాలి. పంచదార కరిగి, పాకం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించి, చల్లబరచడానికి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బేకింగ్‌ ట్రే తీసుకుని దానిలో సుమారు పది ఫిలో షీట్స్‌ పరిచి, దానిపైన కరిగించిన బటర్, పిస్తా, వాల్‌నట్‌ పౌడర్‌ వేసుకోవాలి. 

అనంతరం మరో పది ఫిలో షీట్స్‌ దానిపై పరిచి, చాకుతో పూర్తిగా కాకుండా, నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు సగం వరకూ పాకం పోసుకుని మొత్తం స్ప్రెడ్‌ చేసుకుని, ఆ ట్రేని ఓవెన్‌లో పెట్టుకుని బేక్‌ చేసుకోవాలి. బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు బేక్‌ చేసుకుని ఇప్పుడు మిగిలిన పంచదార సిరప్‌ కూడా పోసుకుని, నచ్చినవిధంగా గార్నిష్‌ చేసుకుని, ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. 

(చదవండి: సేఫ్టీ గాడ్జెట్స్‌.. ఈ టైంలో హెల్ప్‌ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement