
‘నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే.. నీతూ, రీతూ, కాదు కాదు శ్వేత.. అంటూ ఇప్పుడు కొందరు అమ్మాయిలు/అబ్బాయిలు తల బద్ధలు కొట్టుకోవడం లేదు.. మై మమ్/ డాక్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఠక్కున సమాధానం చెబుతున్నారు. అవును మరి జిమ్‌లో వెయిట్స్ లేపాలన్నా, పబ్‌లో ఛీర్స్ చెప్పాలన్నా కఠినమైన ట్రెక్కింగ్‌కి వెళ్లాలన్నా, కాలక్షేపంగా కార్డ్స్ ఆడాలన్నా.. ఇప్పుడు బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌ని వెదుక్కోవాల్సిన పనిలేదు. నిన్న కనీ పెంచిన తల్లిదండ్రులే నేడు కంటి ముందున్న స్నేహితులుగా మారిపోతున్నారు. పిల్లలు కూడా భయంతో వణికిపోకుండా.. ప్రతిదీ తల్లిదండ్రులకు షేర్ చేసుకుంటూ.. దునియా మెచ్చే దోస్తీ అనిపించుకుంటున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో పలువురి నగరవాసుల మనోగతం..
‘అంతకు ముందేమో గానీ మా నాన్న వయసు 70 అంటే ఇప్పుడు అస్సలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆయన నాకన్నా యంగ్ అండ్ యాక్టివ్..’ అంటూ చెప్పారు సింధు. రిటైర్ అయిన తర్వాత తండ్రికి కాలక్షేపం కోసం ట్రెక్కింగ్ పరిచయం చేశా అనుకున్న ఈ యువతి.. ఆ తర్వాత ఆయన తనతోనే పోటీపడే ట్రెక్కింగ్ ఫ్రెండ్‌గా మారతారు.. అని అప్పట్లో అనుకోలేదు మరి. ‘ఇప్పుడు ఏ అడ్వెంచర్ చేయాలన్నా నా దృష్టిలో ఫస్ట్ గుర్తుకొచ్చే ఫ్రెండ్ మా నాన్నే’ అంటున్నారీమె.
గత కొంత కాలంగా అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో తరచూ పాల్గొంటున్న మణికొండ నివాసి సింధు. తండ్రితో కలిసి జాగింగ్ నుంచి జిమ్ వరకూ, సైక్లింగ్ నుంచి ట్రెక్కింగ్ వరకూ కలిసి పంచుకుంటారు. ‘షి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అంటున్నారు ఆమె తండ్రి.. పిల్లలతో కలిసి ఫ్రెండ్స్‌గా ఉంటేనే నేటి ట్రెండ్స్ తెలుస్తాయనేది నగరంలోని పలువురు తల్లిదండ్రుల అభిప్రాయం.
ప్రస్తుతం పిల్లల ఆలోచనాధోరణులు, వాళ్లను ఆకర్షిస్తున్న కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే తమ పిల్లలకి స్నేహితులుగా మారడాన్ని మించిన మార్గం లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ‘మా అబ్బాయి శశాంక్‌కి షాపింగ్ సహా ప్రతి విషయంలోనూ నేను తోడుండాల్సిందే’ అని గర్వంగా చెబుతున్నారు నగర వాసి సుమన్ కృష్ణ.
తనకి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచే ఒక తల్లిలాగా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తూ వచ్చానని ఇటీవలే తన కొడుకుతో కలిసి ఓ ఫారెస్ట్ ట్రెక్ పూర్తి చేసిన సుమన్ అంటున్నారు. నగరవాసి ముంతాజ్ పటేల్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె తారిణ్ పటేల్‌తో కలిసి డియోరియేటల్ చంద్రశిల అనే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసి తిరిగొచ్చిన అనుభవాలు మరచిపోలేనివి అంటున్నారామె.
నేను యంగ్‌గా మారిపోయా..
సోషల్ మీడియా సాక్షిగా వన్ ఆఫ్ ది స్టైలిస్ట్ ఫాదర్ అంటూ ప్రశంసలు అందుకునే అలీ సాగర్..నేను యంగ్‌గా మారిపోయా అంటూ చెబుతున్నారు. ఫ్యాషన్ విషయంలో తన కుమారుడు అమ్మార్‌కి కూడా టిప్స్ అందిస్తుంటారు. గాగుల్స్ ధరించడం దగ్గర నుంచి థ్రిల్స్‌లో పాల్గొనడం వరకూ ఈ ఫాదర్ అండ్ సన్ ఇద్దరూ పోటా పోటీగా రెడీ అవుతుంటారు. తరచూ బైక్ రైడ్స్ వేసే తామిద్దరి మధ్య మాట్లాడుకోకూడనివేవీ లేవని, అసలు సీక్రెట్స్ అనేవే లేవని సగర్వంగా చెబుతారు అలీ సాగర్.
‘మా పిల్లలు మా మాట వినడం లేదండీ’, ‘అసలు వాళ్ల లోకంలో వాళ్లుంటున్నారు. ఇలాగైతే ఏమైపోతారో’. ‘ఎంత చెప్పినా వినడం లేదు. అసలు మమ్మల్ని లెక్కే చేయడం లేదు’ ఇలాంటి కంప్లెయింట్స్‌తో తమను రోజూ పదుల సంఖ్యలో కలుస్తున్న తల్లిదండ్రులకు తాము చెప్పే ఏకైక సలహా.. పిల్లలతో స్నేహం చేయడమే.. అంటున్నారు నగరానికి చెందిన సైకాలజిస్ట్స్.
టెక్ యుగంలో చాలా త్వరగా పిల్లలు పేరెంట్స్ మధ్య గ్యాప్ పెరిగిపోవడం సహజమని, ఇప్పుడిప్పుడే కొందరు తల్లిదండ్రుల్లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ స్వాగతించదగ్గ పరిణామమని, ఈ తరహా పరిస్థితి మరింతగా బలోపేతం కావాల్సి ఉందని అంటున్నారు.
బెస్ట్ ఫ్రెండ్స్ కావాలంటే..
పిల్లలతో గడిపే సమయంలో వ్యక్తిగత వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి.
పిల్లలతో మాట్టాడేటప్పుడు తరచూ నేను నీ నాన్నని/అమ్మని అనే మాట పదే పదే గుర్తు చేయకూడదు.
పిల్లల ప్రతి మూడ్‌నీ షేర్ చేసుకోవాలి. అది మనకు ఎంత నచ్చకున్నా వారికి ఇష్టమైన దేనినీ పదే పదే విమర్శించవద్దు.
వాకింగ్, జిమ్ వర్కవుట్స్, డ్యాన్స్.. లాంటి పనుల్లో తరచూ వారితో మమేకం అవ్వాలి.
వారికి నచ్చిన ఫ్రెండ్స్‌ని, వారి అభిమాన క్రీడాకారుల్ని వీలైనంత వరకూ మనమూ ప్రశంసిస్తుండాలి.
వండిపెట్టాలి, ఇంటిని సర్ధాలి.. ఇలా తల్లిదండ్రుల పనులు అని విభజించకుండా అన్ని పనులూ
అందరివీ అనే భావన వారిలో కలిగేలా చేయాలి.వారి ఫెయిల్యూర్స్ సమయంలో తప్పనిసరిగా పక్కనే అండగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా వారితో కమ్యూనికేట్ అవ్వాలి. అయితే అదేదో వారిపై నిఘా ఉంచిన భావన రానీయకుండా చేయాలి అని నగరానికి చెందిన పలువురు సైకాలజిస్టులు పేరెంట్స్‌కి సూచిస్తున్నారు.
(చదవండి: ఉద్యమ స్నేహం..!)