
రమణుల ఆభరణాల అలంకరణలో చెవుల నుంచి హెయిర్ వరకులేయర్లుగా చెయిన్ ఉండటం ఫ్యాషన్ మాత్రమే కాదు మన సంస్కృతి, సౌందర్యం, ఆచారం కూడా. దక్షిణ భారతదేశంలో చెంపసరాలు, మాటీలుగా పేరున్న ఈ ఇయర్ చెయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. ఇటీవల దుర్గా నవరాత్రుల్లో సెలబ్రిటీలు ధరించిన మాటీల అందం నవతరపు చూపులను ఇట్టే కట్టిపడేసింది.
ప్రాచీన ఆభరణంగా, అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా నిలిచే మాటీలు వివాహ వేడుకలలో వధువు సింగారంలో తప్పనిసరై వెలుగొందుతోంది.పండగల రోజులలో ధరించిన డ్రెస్సుల తగిన ట్రెండీ మోడల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. బంగారం, డైమండ్స్‌లోనే కాదు వివిధ రకాల పూసలు, సిల్వర్, ఆక్సిడైజ్‌లలోనూ ఈ మాటీల అందం మనసు దోచేస్తుంది.
సాంప్రదాయ ఆభరణాలకు మోడర్న్ మెరుపులు జోడించడమే ఈ ఇయర్ చెయిన్స్. ఒకప్పుడు దేవతల విగ్రహాల్లో, అమ్మమ్మల చెవులకు కనిపించిన చెంప సరాలు ఇప్పుడు రన్ వే వేదికలపై అడుగులు వేసే మోడల్స్ చెవుల్లో, మ్యాజిక్ ఫెస్టివల్ లుక్స్‌లో, బ్రైడల్ ఫొటోషూట్లలో కొత్త శైలిలో మెరిసి΄ోతున్నాయి.
దక్షిణ భారతీయ సంప్రదాయాల్లో చెంప సరాలు (ఇయర్ చెయిన్)ఒక ముఖ్యమైన అలంకారం. నాటి కాలంలో మహిళల గౌరవం, ఆభరణ సంపూర్ణతకు చిహ్నంగా వెలుగొందిన చెంప సరాలు రాబోయే వేడుకలలో మరిన్ని ఆకర్షణలను జోడించనున్నాయి.
అద్దుకున్న ఆధునికత
ఈ రోజుల్లో ఆ చెంప సరాలు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. సిల్వర్, ఆక్సిడైజ్డ్, మెరూన్ కలర్ పూసలు, ముత్యాల చెయిన్లు, ఫ్యూషన్ ఫ్యాషన్‌లో కూడా ఇయర్ చెయిన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. సాదాసీదా కుర్తా మీదకైనా, లెహంగా లేదా చీర ధరించినా ఆభరణాల అలంకరణలో ఇయర్ చెయిన్ అందం జత చేరితే ఆ అందం ఇనుమడిస్తుంది.
శక్తి సరాలు..
ఇది కేవలం అలంకారం కాదు. చెవులు–జుట్టు ప్రదేశంలో ఈ సరాలు కదలడం మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు. అందుకే కొంతమంది దీనిని ‘శక్తి సరాలు’గా భావిస్తారు.
సెలబ్రిటీల స్టైల్ టచ్
బాహుబలి సినిమాలో అనుష్క ధరించిన చెవి జూకాలు, చెంప సరాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల దుర్గా నవరాత్రుల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలైన అలియా భట్, జాన్వికపూర్, సోనమ్‌కపూర్, శోభిత ధూళిపాల, నయనతార... లాంటి నటీమణులు తమ ట్రెడిషనల్ ఫొటోషూట్లలో ఇయర్ చెయి ధరించి ట్రెండ్ సెట్ చేశారు.
ఆ లుక్స్ వల్లే ఈ పాత ఆభరణం మళ్లీ యంగ్ జనరేషన్‌లో పాపులర్ అయింది. పాత ఆభరణానికి కొత్త రూపం దక్కింది. ఇప్పుడు వాటి డిజైన్ , మెటీరియల్, వాడుక అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త భాషను పరిచయం చేస్తున్నాయి.
ఇప్పుడు కొంతమంది కళాకారులు రీసైకిల్ మెటల్, హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్‌తోనూ వీటిని రూపొందిస్తున్నారు. అమ్మమ్మల నాటి సంప్రదాయ నెమలి, మామిడిపిందెల నుంచి ప్రారంభమైన చెంప సరాల డిజైన్లు ఈ రోజుల్లో ఇయర్ కఫ్స్ వరకు వినూత్నంగా కళ్లకు కడుతున్నాయి.
(చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..)