
ఎలా పుడుతుందో లేదా చిగురిస్తుందో తెలియని ఈ ప్రేమ..జీవితాలనే తలకిందులు చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కథా సుఖంతమవుతుంది. అయితే ఇది వలుపు వల లేదా ట్రాప్ అన్నది పసిగట్టగలిగితే సేఫ్‌గా ఉండొచ్చు. కానీ అసలు చిక్కు అంత అక్కడే ఉంటుంది. బహుశా దానికున్న శక్తి వల్లనో.. ఏమో..! ..ఎంతటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తినైనా దభాలున పడగొట్టేస్తుంది. తానేం చేస్తున్నది మర్చిపోయేలా దిగజార్చేస్తుంది. అచ్చం అలానే ఓ మహిళ గౌరవప్రదమైన హోదాలో ఉండి..కేవలం రెండక్షరాల ప్రేమ మాయలో పడి అపఖ్యాతీ పాలైంది. దేశ ప్రతిష్టనే దిగజార్చే పనులకు పూనుకుని కళంకితగా మిగిలింది. ఇటీవల అరెస్టు అయినా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ కథతో నాటి దౌత్యవేత్త మాధురి గుప్తా కథ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఎవరామె..? ఎలా పట్టుబడిందంటే..
ఇటీవల జ్యోతి రాణిగా పిలిచే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టు అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టుతో భారత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఇలా ఎలా మన దాయాది దేశానికి గూఢచారులుగా మారుతున్నారని విచారణ చేస్తుంటే..ప్రేమ, డబ్బు తదితరాలే కారణాలుగా వెల్లడవుతున్నాయి.
ఇదొక హనీట్రాప్ మాదిరిగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అచ్చం అలానే నాటి భారతీయ దౌత్యవేత్త అపఖ్యాతీ పాలై దోషిగా నిలబడిన ఘటన కళ్లముందు మెదులుతోంది. యావత్ దేశం తలదించుకునేలా దుశ్చర్యకు పాల్పడింది. అత్యున్నత హోదాలో ఉండి..అన్నేళ్లు అనుభవం అంతలా ఎలా దిగజారిపోయిందన్న అనుమానాలు లేవనెత్తాయి. ఇంతకీ ఎవరామె అంటే..
ఆమె కథ ఓ బాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంటుంది. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి గుప్తా పాకిస్తానీ వ్యక్తిని ప్రేమలో పడి.. ఆ దేశం కోసం గుఢచారిగా మారిపోయింది. ఉర్దూలో నిష్ణాతురాలైన ఆమె సూఫీ కవిత్వంలో అతడికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2010లో ముంబై దాడుల అనంతరం 18 నెలలు తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో గుసగుసలు వినిపించాయి. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి పాక్‌కి గుఢాచారిగా పనిచేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో క్లోక్-అండ్-డాగర్ నిఘా ఆపరేషన్ చేపట్టి నిజనిజాలు వెలికితీసింది. ఆ ఆపరేషన్‌లోనే..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా పనిచేసిన ఆమె పాక్ అపరిచిత యువకుడితో ప్రేమలో పడటంతోనే..అమె అపార అనుభవం మంటగలిసిపోయిందని తేలింది. అస్సలు ఆమె అలా చేస్తుందని నమ్మబుద్ది కానీ విధంగా జాగ్రత్తపడిందని అన్నారు నిఘా అధికారుల.
ఇక్కడ మాధురి గుప్తా పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ ప్రెస్ అండ్ ఐటీ విభాగంలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పాక్ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేయడం ప్రారంభించిందని తేలింది. అదీగాక ఆమెకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేసేలా బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
అక్కడ ఆమె 30 ఏళ్ల జంషెడ్ అలియాస్ జిమ్‌ను కలిసింది. కొద్దికాలంలోనే అతడి ప్రేమలో పడింది. చెప్పాలంటే ఆమె హనీట్రాప్‌లో చిక్కుకుందని చెప్పారు అధికారులు. దేశ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆమెను వాడుకునేందుకు ఇలా ప్రేమ వలపును విసిరాడు జిమ్. అతడిపై ఉన్న గుడ్డిప్రేమతో ఆమె మన దేశ నిఘా కార్యకలాపాలను, రహస్య సమాచారాన్ని చేరవేయడం ప్రారభించిందని తెలిపారు. ఆమె మెయిల్ అకౌట్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఆ ఈమెయిల్‌లో వారి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణ బట్టి వారి మధ్య సాన్నిహిత్యం కాస్తా.. వివాహేతర బంధంగా మారిందని తేలింది.
దీంతో నిఘా అధికారులు.. సార్క్ శిఖరాగ్ర సమావేశం నెపంతో ఆమెను ఏప్రిల్ 2010లో ఢిల్లీకి పిలిపించారు. అక్కడే భారత ఇంటిలిజెన్సీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడ ఆమె చేసిన నేరాలన్నింటిని అంగీకరించడం తోపాటు..ఇంత సమయం పట్టిందా నన్ను అదుపులోకి తీసుకోవడానికి అని అధికారులే అవాక్కయ్యేలా సమాధానమిచ్చింది మాధురి గుప్తా. ఆమెను అరెస్టు చేసి కోర్టుమందు హాజరుపరిచారు.
అక్కడ ఆమె కేసు సంత్సరాల తరబడి కొనసాగింది. చివరికి వాదోపవాదనల అనంతరం మే 2018లో తీర్పు వెలువరించింది కోర్టు. ఆమె నేరపూరిత కుట్ర, గూఢచర్యం కేసులో దోషిగా నిర్థారిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఒకప్పుడూ గౌరవనీయమైన హోదాలో ఉండి దేశ ప్రతిష్టను దెబ్బతీసిలా పనులకు పూనుకోవడమే గాక మన దేశ భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొంటూ శిక్ష విధించింది.
ఇలా చేయడానికి రీజన్..
కేవలం ఒంటరితనం, వృత్తిపరమైన సంఘటర్షణ లేదా వ్యవస్థపై ఉన్న కోపంతోనో ఇలా చేసి ఉండొచ్చనేది నిపుణులు అంచనా. కానీ ఈ స్టోరీలో దౌత్యవేత్తగా అత్యున్నత హోదాలో ఉన్న ఆమె పార అనుభవం, తెలివితేటలు 'ప్రేమ' అనే రెండు అక్షరాల ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందా అనేది మింగుడుపడని అంశంగా కనిపించింది అధికారులకి.
(చదవండి: మెరిసిన చేనేత..మురిసిన భామలు)