
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది.
చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్‌ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.
అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..
పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.
ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..
అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్‌లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు.
ర్యాంప్‌వాక్ అదుర్స్
ర్యాంప్‌వాక్‌లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది.
1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం
పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలు
పోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు.
పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి..
దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.
పేటెంట్ హక్కులతో ముందుకు..
పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్‌లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి.
– ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
చేనేతకు ప్రభుత్వం చేయూత
తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది.
– కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి
(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! )