Health Tips: బ్రౌన్‌ రైస్, వైల్డ్‌ రైస్‌.. 40 వేల రకాల బియ్యాలు.. హాయిగా అన్నమే తిందాం!

Diabetes: There Are 40000 Types Of Rice Brown Rice Wild Rice Uses - Sakshi

ఇన్ని అన్నాలున్నాయి.. హాయిగా అన్నమే తిందాం

Health Tips: బ్రౌన్‌ రైస్, హోల్‌ గ్రైన్‌ బాసుమతి రైస్, స్టీమ్‌డ్‌ బ్రౌన్‌ రైస్, రెడ్‌ రైస్, బ్లాక్‌ రైస్, వైల్డ్‌ రైస్‌... ఇన్ని రకాల బియ్యాలున్నాయా! అని ఆశ్చర్యపోవద్దు. ప్రపంచవ్యాప్తంగా నలభై వేల రకాల బియ్యాలున్నాయి. వీటన్నింటికి తోడుగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థుల కోసం శాస్త్రవేత్తలు శోధించి, అనేక ప్రయోగాలు చేసి మరో కొత్త రకం బియ్యాన్ని పండించారు. అదే ‘లో గ్లైసిమిక్‌ వైట్‌ రైస్‌’.

‘తెల్లటి అన్నం తినకపోతే భోజనం చేసినట్లే ఉండదు, ఈ డయాబెటిస్‌ పాలిట పడి మంచి అన్నం కూడా తినలేకపోతున్నాను’ అని ఆవేదన చెందేవాళ్లకు ఈ బియ్యం మంచి పరిష్కారం. ఈ బియ్యం సగ్గుబియ్యం కొద్దిగా పొడవుగా సాగినట్లు ఉండి, ముత్యాలు రాశిపోసినట్లు ఉంటాయి. అయితే వీటి ధర కొంచెం ఎక్కువే. కేజీ నూటపాతిక వరకు ఉంటోంది. లభ్యత విరివిగా లేదు. ఎందుకంటే రైతులకు ఈ వంగడం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదింకా. 

సరదాగా తెలుసుకుందాం!
బ్లాక్‌రైస్‌ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. ఇప్పుడు మన దగ్గర కొందరు రైతులు ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదులో పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండిన అన్నం కొంచెం వగరుగా ఉంటుంది. వైల్డ్‌రైస్‌ అనే పదమే విచిత్రంగా ఉంది కదూ! నిజమే, ఇది ఎవరూ నారు పోసి నీరు పెట్టి పండించే పంట కాదు. నేటివ్‌ అమెరికన్‌లు నదుల తీరాన, కాలువల తీరాన సేకరించే బియ్యం.

హోల్‌ బాసుమతి బియ్యం నగరాల్లో దొరుకుతోంది. ఇక బ్రౌన్‌రైస్, స్టీమ్‌డ్‌ బ్రౌన్‌ రైస్, రెడ్‌ రైస్‌లయితే చిన్న పట్టణాల్లో కూడా విరివిగా లభిస్తాయి. వీటిలో ఏవీ పొట్టు తీసినవి కాదు, కాబట్టి ఈ అన్నాలన్నీ ఆరోగ్యానికి మంచిదే. ప్రకృతి బియ్యం గింజలో మెత్తటి గంజిపొడిలాంటి పదార్థంతోపాటు దానిని నెమ్మదిగా జీర్ణం చేయించడానికి పీచును కూడా పై పొరగా కలిపి ఇచ్చింది. మనం రుచికి బానిసలమై ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన పై పొరను తొలగించి తినడంతోనే ఈ సమస్యలన్నీ.
 
ఇవి కూడా మంచివే!
శాస్త్రవేత్తలు రూపొందించిన ‘లో గ్లైసిమిక్‌ వైట్‌ రైస్‌’ అందుబాటులో లేనప్పుడు మనం పైన చెప్పుకున్న బియ్యాల్లో దేనినైనా వండుకుని హాయిగా అన్నం తినవచ్చు. బ్రౌన్‌రైస్‌కి పైన ఉండే పోషకాలు, పీచుతో కూడిన పొరను తీసేసి బియ్యాన్ని తెల్లబరుస్తారు. అవే డబుల్‌ పాలిష్డ్‌ రైస్‌. ఆ బియ్యంలో కేవలం గంజిపొడిలాంటి భాగం మాత్రమే మిగులుతుంది. డబుల్‌ పాలిష్‌ చేసిన ఆ బియ్యంతో వండిన అన్నం తిన్నప్పుడు కార్బోహైడ్రేట్‌లు, కేలరీలు పెద్ద మొత్తంలో దేహానికి అందుతాయి. చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు అన్నం తినడం మంచిది కాదని చెబుతారు డాక్టర్‌లు. 

చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top