
‘కొడుకా! నేనెటులొ, అట్లె బాహ్లికుడు కూర్చున్ నీకు...’ అంటాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడితో! ‘కుమారా! నీకు నేనెంతో, అంత గానూ కావలసినవాడు, ప్రియబాంధవుడూ బాహ్లికుడు. నేనూ, బాహ్లికుడూ, భీష్ముడూ... నీకు అత్యంత పూజనీయులం. మా మాట కాదని ధర్మరాజుతో యుద్ధానికి దిగవద్దు’ అని దీనంగా బతిమాలు కొంటాడు. ఈ ఘట్టం విన్నప్పుడు, దుర్యోధనుడికి తండ్రి తాతల సరసన మూడో అతి ముఖ్య బంధువయిన బాహ్లి కుడు ఎవరు, ఆయన ఎందుకు ప్రసిద్ధుడు కాలేదు అని సందేహం వస్తుంది.
బాహ్లికుడు, భీష్ముడి తండ్రి శంతనుడి సోద రుడు. భీష్ముడికి పెత్తండ్రి. ఆయన తండ్రి ప్రతీపుడు తను రాజుగా ఉన్నప్పుడే, బాహ్లికుడికి కొంత రాజ్యభాగం ఇచ్చి రాజును చేశాడు. ఆ తరవాత కొన్ని అసా ధారణ పరిస్థితుల వల్ల చిన్న కొడుకయిన శంతనుడికి హస్తినాపుర రాజ్యాధికారం లభించింది. పరిశీలనగా చూస్తే, చరిత్రలో ఎన్నెన్నో రాజ్యాధికార వారసత్వాలు అసాధారణంగా సంక్రమించటం కనిపి స్తుంది. భారతంలో అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి.
ఇదీ చదవండి: షారూఖ్‌ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!
భారతంలో బాహ్లికుడికి ప్రధాన పాత్ర లేదు. ఆయన పేరు అరుదుగా వినిపిస్తుంది. కానీ వంశంలో అందరి కంటె వృద్ధుడిగా, ఆయన కౌరవ పాండవులిద్దరికీ సన్నిహితుడే. వాళ్ళ ఇళ్ళలో శుభాశుభ కార్యాలన్నిటికీ ఆయనే ఇంటి పెద్ద. పూజ్యుడు.ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, ఆయన వచ్చిఇంటి పెద్దగా గొప్ప గౌరవం పొంది, ఒక ఉత్తమ రథాన్ని కానుకగా ఇస్తాడు. ద్రౌపదీ మానభంగ ఘట్టంలో నిస్సహాయంగా చూస్తూ ఊరు కొన్న కురు వృద్ధ, గురు వృద్ధ, బాంధవులలో బాహ్లికుడు ఉన్నాడు. తరవాత జరిగిన రెండో విడత జూదం వారించేందుకు గట్టిగా చెప్పి చూసిన పెద్దలలో బాహ్లికుడి పేరు కూడా కనిపిస్తుంది.భీష్మ పితామహుడికే పెద తండ్రి అయిన బాహ్లికుడు, పండు ముసలితనంలో కూడా భారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరా డాడు. భీష్ముడి పరిగణనలో ఆయన కౌరవ పక్షంలో ఉన్న మహావీరు లలో అగ్రగణ్యులలో ఒకడు. ‘అతిరథుడు బాహ్లికుడు విను, అతులిత బలు, డతని యట్ల ఆత్మజుడును...’ అని అభివర్ణిస్తాడు గాంగేయుడు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి, చివరికి భీముడి చేత వీరమరణం పాలవుతాడు. మహాభారత కథ ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన ఉదాత్తమైన పాత్రల ద్వారా మానవ స్వభావాన్ని అనేక కోణాల నుంచి ఆవిష్కరించి చూపు తుంది. అందుకే, చదివితే భారతమే చదవాలి!
– ఎం. మారుతి శాస్త్రి