
వికాసం
‘మాది ఘిసడి సంచార తెగ’ అని చెప్పుకోవడానికి కొద్దిమంది సంశయిస్తారు. దీనికి కారణం బ్రిటిష్ కాలంలో ఆ తెగకు ‘క్రిమినల్ ట్రైబ్’గా ముద్ర వేయడం. కానీ దీపా పవార్... ‘నేను ఘిసడి తెగకు చెందిన మహిళను’ అని సగర్వంగా చెప్పుకోవడమే కాదు తన జాతిజనుల కోసం సామాజిక కార్యకర్తగా ఎంతో శ్రమిస్తోంది. తాజాగా... అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ‘మన్ బోలి’ అనే పుస్తకం రాసింది దీపా పవార్...
ఒక వర్క్‌షాప్‌లో...
‘బాధగా ఉందని తెలియకుండానే రోజూ మనం మోసే బరువు పేరు ఏమిటి?’ అని అడిగింది ఒక గిరిజన యువతి.
ఆ ప్రశ్నే దీపా పవర్‌ను ‘మన్ బోలి’ పుస్తకం రాసేలా చేసింది.
ఆ బరువు పేరు... మానసిక సమస్య. పేరు పెట్టని ఆ బరువు వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. వ్యవస్థ తాలూకు నిశ్శబ్దం. నిర్లక్ష్యం. ‘మెంటల్ హెల్త్ అనేది కులం, పేదరికం, భాష, అధికారంతో ముడిపడి ఉంది. మన దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ అనేది చాలా వరకు పట్టణప్రాంతాలు, ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కేర్ గ్రామర్‌ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం’ అంటుంది దీప.
తమ తెగలోని సామెతల నుంచి కథల వరకు రకరకాల అంశాలను ఉపయోగించి మానసిక ఆరోగ్యానికి, అట్టడుగు ప్రజల మధ్య ఉన్న అంతరాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేసింది దీప. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన ఉన్న దీపా పవార్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌తో కలిసి పనిచేసింది. ఆ అనుభవం పుస్తకానికి బలం అయింది. ఘిసడి సంచార తెగకు చెందిన దీపా పవార్ పద్నాలుగు సంవత్సరాల వయసులో సామాజిక కార్యకర్తగా మారింది. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేసింది.
కమ్యూనిటీ డెవలప్‌మెంట్ నుంచి శానిటేషన్ వరకు జెండర్ నుంచి హెల్త్ వరకు ఎన్నో అంశాలపై పనిచేసింది. ‘ఘిసడి సంచార తెగకు చెందిన మహిళను’ అని గర్వంగా చెప్పుకునే దీప ఆ తెగలోని మూఢనమ్మకాలపై కూడా పోరాడింది. ‘ఆడపిల్లలకు చదువు అవసరం’ లేదు’ అనుకునే వారి దృష్టిని మార్చడానికి కృషి చేసింది. ‘అనుభూతి’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేసింది. మహారాష్ట్రలోని ఎన్నో జిల్లాలలో మెంటల్ హెల్త్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తోంది. రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.