
‘హార్ట్ ల్యాంప్’ ఇద్దరు మహిళల హృదయ స్పందన!
మూల రచయిత బాను ముష్టాక్(Banu Mushtaq) తన కమ్యూనిటీలోని స్త్రీల సమస్యలను చిన్న చిన్న కథలుగా అక్షరీకరిస్తే .. ఆ సహజత్వాన్ని, సున్నితత్వాన్ని అంతే చక్కగా అంగ్లీకరించి తన స్పందననూ తెలియజేశారు దీపాభష్ఠీ! ఈ రచనతో బాను ముష్టాక్ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి ప్రాంతీయ భాషా రచయితగా, రెండో భారతీయురాలిగా నిలిస్తే, ఇదే రచనతో దీపాభష్ఠీ(Deepa Bhasthi).. బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ అనువాదకురాలిగా ప్రపంచ సాహిత్య రంగంలో చరిత్ర సృష్టించారు. ‘హార్ట్ ల్యాంప్’ కన్నడ సాహిత్యంలో ఓ గొప్ప అచీవ్‌మెంటే కాదు ప్రపంచపాఠకులకు గొప్ప కానుకగా అభివర్ణిస్తున్నారు సాహిత్యకారులు. అంతేకాదు దీపాభష్ఠీ అనువాదం చిక్కగా..పాఠకులను ఉత్తేజపరిచేలా ఉంది. ఇలాంటి శైలి నేటి ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో అరుదుగా కనిపిస్తోందని ప్రశంసిస్తున్నారు.
దీపాభష్ఠీ సొంతూరు కర్ణాటకలోని కొడగు జిల్లా, మడికేరి. మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశారు. ఆమె అనువాదకురాలే కాదు పిల్లల రచయిత, కాలమిస్ట్, సాంస్కృతిక విమర్శకురాలు కూడా. దీపారాసిన వ్యాసాలు, కాలమ్స్, సాంస్కృతిక విమర్శలు, ఫిక్షన్స్ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కన్నడ ప్రముఖ రచయిత కోట శివరామ కారంత్ నవల ‘అదే ఊరు, అదే మార’ను ‘ద సేమ్ విలేజ్, ద సేమ్ ట్రీ’గా, కన్నడ స్త్రీవాద రచయిత కొడగిన గౌరమ్మ రచన ‘ఫేట్స్ గేమ్ అండ్ అదర్ స్టోరీస్’గా ఆంగ్లంలోకి అనువదించారు. మూల రచనను ఉన్నదున్నట్టుగా అనువదించడం ఆమె స్టయిల్ కాదు. ఆ రచనల్లోని ఆత్మను పట్టుకుంటారు. అందుకే మూల రచనల్లోని స్థానికత ఆమె అంగ్ల అనువాదంలో ఎక్కడా మిస్ కాదు.
పాఠకులకు మూల రచన చదివిన అనుభూతే కలుగుతుంది. ఆ శైలికే బుకర్ ఆమెను వరించింది. ‘హార్ట్ ల్యాంప్’ను అనువదించే ముందు దీపా.. ఇస్లాం స్త్రీల తీరుతెన్నులు, సంస్కృతీసంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడానికిపాకిస్తానీ సీరియల్స్ చూసేవారట. ఉర్దూ చదవడం, రాయడం వరకే కాకుండా సామెతలు, జాతీయాలు, నుడికారాలు సహా భాషను నేర్చుకున్నారట. ఆ కమిట్‌మెంటే ఆమెకు ఈ రోజు ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆమె రాసిన పిల్లల పుస్తకం ‘చంపి అండ్ ఫిగ్ ట్రీ’ పుస్తకం త్వరలోనే పబ్లిష్ కానుంది.