
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారని వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ట్రంప్ గుర్తింపు పొందారు. ట్రంప్ గుండె వయస్సు అతని వయస్సు కన్నా 14 ఏళ్లు చిన్నదిగా ఉన్నదని వైట్‌హౌస్ వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
గత జనవరిలో వైట్ హౌస్‌లో తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 79 ఏళ్ల ట్రంప్ తన పరిపాలనలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు.‘ట్రంప్ అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారు. అతని గుండె ఎంతో చక్కగా పనిచేస్తున్నదని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా తెలిపారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు వెల్లడించారు. ట్రంప్ తన అంతర్జాతీయ ప్రయాణానికి ముందుగా కోవిడ్-19 బూస్టర్ టీకాలు తీసుకోవడంతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మంచి రోగనిరోధక శక్తి పొందారని కరోలిన్ లీవిట్ తెలిపారు. ట్రంప్ గుండె పనితీరు అతనికన్నా 14 ఏళ్ల చిన్నవయసులో అంటే 65 ఏళ్ల వయసులో ఉన్న గుండె మాదిరిగా చురుకుగా పనిచేస్తున్నదన్నారు.
ట్రంప్ ఆరోగ్యంపై ఏడాదిగా పలు వార్తలు వెలువడుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో నాటి అధ్యక్షుడు జో బైడెన్ వయసు, ఆరోగ్యంపై అప్పటి ప్రత్యర్థి ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ తాను ఆరోగ్యంపరంగా ఫిట్‌గా ఉన్నానని ప్రకటించుకున్నారు. తాజాగా ట్రంప్ మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరు నెలల తర్వాత ట్రంప్ చేయించుకున్న వైద్య పరీక్షల్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉందని వెల్లడయ్యింది.
గత జూలైలో అధ్యక్షుడు ట్రంప్ తన కాళ్ల దిగువ భాగంలో వాపు, కుడి చేతిలో గాయాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో దర్శనమిచ్చాయి. ఈ సమయంలో వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వారిలో కాళ్లలో వాపు కనిపించడం సాధారణమైన స్థితి అని తెలిపారు. అలాగే తరచూ కలరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం కారణంగా ట్రంప్ చేతికి గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 2020లో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు.