
గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ లిపోప్రోటీన్ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.
కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్ హెల్త్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు.
(చదవండి: పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..)