
అవును. ఆమె చెప్పిందే జరిగింది. జపనీస్ బాబా వాంగా పేరిట ఫేమస్ అయిన మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి చెప్పింది అక్షరాలా నిజమైంది. జపా న్ తీరాలను పెద్ద సునామీ తాకింది. ఆమె చెప్పిన తేదీన కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది. జపాన్ తీరాన్ని జులై 5న సునామీ ముంచెత్తుతుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలైæ 30న ముంచుకొచ్చింది. దాంతో మాంగా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది.
ఎవరీ రియో తత్సుకి?
తత్సుకి సాధారణ మాంగా ఆర్టిస్ట్ కాదు. ఆమె కలల మధ్య నడిచిన సత్యమని చెబితే అతిశయోక్తేమీ కాదు. ‘ద ఫ్యూచర్ దట్ ఐ సా (నేను చూసిన భవిష్యత్తు)’ పేరిట 1990 దశాబ్దం చివరలో ఆమె ఓ పుస్తకం రాసింది! ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కలల్ని కథలుగా మార్చింది. అప్పట్లో దాన్నెవరూ పట్టించుకోలేదు. కామిక్ పుస్తకంగా భావించారు. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని పుస్తకంపై ఓ మాట ఉంది. అన్నట్టుగానే అదే నెలలో జపాన్‌ను భూకంపం, సునామీ వణికించాయి. దాంతో అంతా షాకయ్యారు.
ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యద్దర్శన శక్తి ఉందని కొందరు నమ్మడం మొదలుపెట్టారు. తత్సుకి కలలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. ఆ పుస్తకానికి 2021లో మరో ఎడిషన్ తీసుకొచ్చిందామె. అందులో ఓ కొత్త తేదీ వేసింది. అదే 2025 జూలై 5. ఆ రోజు ఫిలిప్పైన్స్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతుందని, సముద్రం ఉప్పొంగిబోతుందని, వరుస భూకంపాలు రావొచ్చని చెప్పింది. 2011 సునామీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చంటూ డ్రాయింగ్ వేసింది. అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్‌ను సునామీ వణికించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్