Cyber Crime Prevention Tips: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌.. ‘క్యూఆర్‌’ కోడ్‌తో పేమెంట్‌ చేస్తున్నారా?!

Cyber Crime Prevention Tips By Expert: Follow These While Digital Transactions - Sakshi

ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వెంట డబ్బులు ఉండనక్కర్లేదు. డెబిట్‌ కార్డ్‌ కూడా అవసరం లేదు. స్మార్ట్‌ ఫోన్‌.. అందులో డిజిటల్‌ చెల్లింపుల ఎంపిక ఉంటే చాలు. దీంట్లో భాగంగానే ‘క్యూఆర్‌’ కోడ్‌ వచ్చాక మన జీవితం మరింత సులభం అయిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ పద్ధతి వల్ల మోసాల బారినపడుతున్నవారూ ఉన్నారు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారు తప్పనిసరిగా ‘క్యూ ఆర్‌’ కోడ్‌ గురించి తెలుసుకోవాల్సిందే! 

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నగదు చెల్లించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా మన జీవితం మరింత సులభతరంగా మారిపోయింది.

క్షణాల్లో చెల్లింపులు
నెఫ్ట్‌ లేదా ఆర్‌టిజిఎస్‌ లావాదేవీలను పూర్తి చేయడానికి  యుపిఐ అనేది స్వల్పకాలిక చెల్లింపు పద్ధతి. ఆర్థిక లావాదేవీని జరపడానికి .. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్, నగదు మొత్తం, అంకెల పిన్‌ చేస్తే చాలు లావాదేవీ సెకన్లలో పూర్తవుతుంది. క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించే యాప్స్‌ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌ లు ప్రధానమైనవి.

తర్వాత జాబితాలో భీమ్‌ యాప్, మొబిక్‌విక్, పేజ్‌యాప్, రేజర్‌పే మొదలైనవి ఉన్నాయి. క్విక్‌ రెస్పాన్స్‌ అనే క్యూఆర్‌ కోడ్‌ బార్‌కోడ్‌ డేటాతో ఎన్‌కోడ్‌ చేసే స్కాన్‌. బాధితుల డబ్బు దొంగిలించడానికి మోసగాళ్లు వారి సొంత క్యూఆర్‌ కోడ్‌లను సృష్టిస్తారు. లేదా బాధితుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రాబడతారు. 

లింక్స్‌ ద్వారా ఎర
సాధారణంగా బయట షాపింగ్‌ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తదు. ఆన్‌లైన్‌  బిజినెస్‌లో భాగంగా తమ వస్తువును విక్రయించడానికి చేసే పోస్టులో మోసగాళ్లు క్యూఆర్‌ కోడ్‌ కూడా రూపొందిస్తారు. ఈ లింక్‌ను వాట్సప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు.

దీనికి ఆకర్షితులై లింక్‌ ఓపెన్‌ చేశాక, నగదు చెల్లింపులకు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయమని బాధితుడిని కోరుతారు. బాధితులు తమ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. డబ్బులు జమ చేస్తామని నమ్మించి, మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తారు.  

ఫోన్‌ చేసి.. రాబట్టే ప్రక్రియ
ఒక సైబర్‌ నేరస్థుడు మీకు ఫోన్‌ చేసి ఫలానా బహుమతి గెలుచుకున్నారని నమ్మబలుకుతాడు. ఆ బహుమతిని పొందడానికి తాను పంపిన క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయమని కోరుతాడు. మీకు తెలిసిన లేదా నమ్మకం కలిగించే వ్యక్తిగా వ్యవహరిస్తాడు.

దీని నుంచి వారు మీ డేటాను పొందవచ్చు. చాలా నేరాలు ఫిషింగ్‌ కాల్స్, ఎసెమ్మెస్‌/ఇ–మెయిల్స్‌ లేదా సోషల్‌ మీడియా ద్వారా జరుగుతాయి. స్కామర్‌లు ఇప్పుడు వారి మోడస్‌ ఆపరెండీని క్యూఆర్‌ కోడ్‌లకు కూడా మార్చారనే విషయాన్ని గుర్తుంచుకోండి. 

మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త, సృజనాత్మక మార్గాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. వాటిలో క్యూఆర్‌ కోడ్‌ ఒకటి. స్కామర్‌లు మీకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఇ–మెయిల్‌ లేదా సోషల్‌ మీడియాలో సందేశాన్ని పంపుతారు. క్యూఆర్‌ కోడ్‌తో మీరు డబ్బును తిరిగి పొందవచ్చుని పేర్కొంటారు.
మనం చూసిన క్యూఆర్‌ కోడ్‌ చట్టబద్ధమైనదిగా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన ప్రకటనలుగా వాట్సప్, సోషల్‌ మీడియా సందేశాలు ఉంటాయి.
ఉదా: క్యూఆర్‌ కోడ్‌ చిత్రంతో పాటు మీరు రూ. 5,00,000 గెలుచుకున్నందుకు అభినందనలు అని ఉందనుకోండి. ఆ మెసేజ్‌కు ఆకర్షితుడైన బాధితుడు కోడ్‌ని స్కాన్‌ చేసి, మొత్తాన్ని నమోదు చేసి, తన బ్యాంకు అకౌంట్‌కు బదిలీచేయాలనుకుంటాడు.

ఆ తర్వాత ఖాతాలోకి నగదును స్వీకరించడానికి పిన్‌ ఉంటుంది. తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని బాధితులు నమ్ముతారు. కానీ డబ్బును స్వీకరించడానికి బదులుగా మన ఖాతా నుండి నగదు వేరే అకౌంట్‌కు బదిలీ అవుతుంది.  

తప్పుడు క్యూఆర్‌ కోడ్స్‌
ఫిషింగ్‌ ఇ–మెయిల్‌లు, టెక్ట్స్‌ లేదా సోషల్‌ మీడియా పోస్ట్‌లలో తప్పుడు క్యూఆర్‌కోడ్‌లను ఉపయోగించడం మరొక పద్ధతి. తప్పుడు కోడ్‌ను స్కాన్‌ చేసిన తర్వాత, వినియోగదారులు వాస్తవికంగా కనిపించే పేజీలతో వెబ్‌సైట్‌లకు మళ్లించబడతారు, అక్కడ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం అందించడం ద్వారా బాధితుడు అకౌంట్‌ లాగిన్‌ అయ్యేలా చూడచ్చు. 

సురక్షితమైన చెల్లింపులకు...
అంతటా క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. మీరు బాధ్యతాయుతంగా ఈ లావాదేవీలు జరిపినప్పుడు మీ బ్యాంకు ఖాతా నగదు సురక్షితంగా ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ తో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే అవి యంత్రాల ద్వారా మాత్రమే చదవబడతాయి.

మీరు స్నేహితుడికి కొంత డబ్బును బదిలీచేయాలనుకుంటే ఉదాహరణకు.. డబ్బును పంపే ముందు మీరు వారి ఖాతా నంబర్, మొత్తం, ఇతర సమాచారాన్ని ధృవీకరించాలి. క్యూఆర్‌ కోడ్‌తో ఆ అవసరం లేదు. అందుకని.. తెలియని కోడ్‌ను స్కాన్‌ చేయకూడదు. 

డబ్బు చెల్లించడానికే క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగపడుతుంది. వివరాలు తెలియజేయడానికి కాదు. డబ్బును స్వీకరించడానికి బదులుగా, మీకు మొత్తం క్రెడిట్‌ చేయబడుతుంది స్కాన్‌ చేయమని అడిగితే అది స్కామ్‌ కావచ్చని గ్రహించండి.

మీ వ్యక్తిగత ఖాతా వివరాలు మోసగాళ్లచే దొంగిలించబడుతున్నాయని తెలుసుకోండి. వివరాల ఆధారంగా మీ బ్యాంక్‌ ఖాతా నుండి స్కామర్లు ఎక్కువ మొత్తం నగదు దొంగిలించవచ్చు.

మీ బ్యాంక్‌ పంపిన ఈ–మెసేజ్‌లు, మెయిల్‌ల గురించి విచారించడానికి నేరుగా బ్యాంక్‌ను సంప్రదించండి. అంతేకాని, మీ బ్యాంక్‌ ద్వారా పంపబడినట్లు భావిస్తున్న క్యూఆర్‌ కోడ్‌తో స్పామ్‌ లేదా అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించకండి. 
మీరు నమ్మని క్యూఆర్‌ కోడ్‌ని మీరు చూసినట్లయితే, మీరు అందించే సేవ లేదా ఉత్పత్తి గురించిన మరింత సమాచారాన్ని మాన్యువల్‌గా చూసేందుకు ప్రయత్నించండి. 
క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయమని మిమ్మల్ని అడిగే స్పామర్‌లకు ‘నో‘ చెప్పడానికి భయపడకండి. మీకు కష్టంగా అనిపిస్తే, వాటిని బ్లాక్‌ చేసి సంబంధిత వెబ్‌సైట్‌ లేదా బ్యాంక్‌ లేదా సోషల్‌ మీడియాకు తెలియజేయండి. 
మీరు క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌కి బాధితులుగా మారితే వెంటనే చేయాల్సింది...  

cybercrime.gov.in/uploadmedia/MHA-CitizenManualReportOtherCyberCrime-v10.pdfలో ఫిర్యాదును నమోదు చేయండి. లేదా ఫిర్యాదు చేయడానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించండి.

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి కాల్‌ చేయవచ్చు, ఇది సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారిచే నిర్వహించబడుతుంది.  
ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 
చదవండి: Cyber Crime Prevention Tips: క్రెడిట్‌ కార్డ్‌ గడువు ముగిసిందని ఫోన్‌.. ఆధార్‌ వివరాలు చెప్పినందుకు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top