Cyber Crime Prevention Tips: క్రెడిట్‌ కార్డ్‌ గడువు ముగిసిందని ఫోన్‌.. ఆధార్‌ వివరాలు చెప్పినందుకు!

Cyber Crime Prevention Tips: How To Secure Your Aadhaar Card Information - Sakshi

ఆధారం కోల్పోకండి..

ఉద్యోగి అయిన మహిజకు క్రెడిట్‌ కార్డ్‌ గడువు ముగిసిందని, కార్డ్‌ని మళ్లీ పంపించేందుకు వివరాలు అవసరమని ఫోన్‌ కాలర్‌ చెప్పింది. ఫోన్‌లో ఆధార్‌ నెంబర్, ఇతర వివరాలనూ పంచుకున్న మహిజ మరుసటి రోజు తన క్రెడిట్‌కార్డ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు డెబిట్‌ అయినట్టు గమనించింది. స్కామర్లు మీ ఆధార్‌ను యాక్సెస్‌ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే... మీకు అందుకు తగిన సమాచారమూ తెలిసి ఉండాలి.

మోసగాళ్లు బ్యాంక్‌ ఖాతాదారుల డబ్బు స్వాహా చేసినందుకు వారి ఆధార్‌ నంబర్‌లను రాబట్టేందుకు మభ్యపెట్టడంలో ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టరు. మీ ఆధార్‌ నంబర్‌ లేదా OTP లేదా పాస్‌వర్డ్‌ కోసం బ్యాంక్‌ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు మీకు ఎప్పుడైనా కాల్‌ చేసినట్లయితే, వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న స్కామ్‌స్టర్‌ అయ్యే అవకాశం ఉంది. 

1) మొబైల్‌/ఇ–మెయిల్‌ నమోదు
ఇటీవలి కాలంలో ఆధార్‌ వల్ల మీ వివరాలను మార్చడం సులభం అయ్యింది. ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్‌ లేదా ఇ–మెయిల్‌ ఐఈకి వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP )తో ప్రక్రియలో ఎలాంటి జాప్యం కూడా ఉండటం లేదు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్‌ నంబర్‌ను మార్చుకున్నా, ఇతరులు మీ వివరాలతో మిమ్మల్నే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మీ ఆధార్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేయడం మర్చిపోవద్దు. 

2) ఆధార్‌ బయోమెట్రిక్స్‌ లాకింగ్‌
ఐరిస్‌ స్కాన్‌లు, వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్‌లు వంటి బయోమెట్రిక్‌లు ఆధార్‌ కార్డ్‌కి లింక్‌ అయ్యాయి. ఈ అంశంలో మోసం చేయడం చాలా కష్టమైనప్పటికీ, వ్యక్తి బ్యాంక్‌ ఖాతాను యాక్సెస్‌ చేయడానికి వేలిముద్రలను నకిలీ చేసిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బయోమెట్రిక్‌ లాకింగ్‌ ఆప్షన్‌తో ఆధార్‌ బయటకు వచ్చింది.  UIDAI దాని కార్డ్‌ హోల్డర్‌లకు బయోమెట్రిక్‌ను లాక్‌ చేసి ఉంచాలని సలహా ఇస్తుంది. దీన్ని వెబ్‌సైట్‌ లేదా mAadhaar యాప్‌ ద్వారా చేయవచ్చు.

3) మాస్క్‌డ్‌ ఆధార్, వర్చువల్‌ ID (VID)
eKYC సేవను నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆధార్‌ నంబర్‌ స్థానంలో 16 అంకెల సంఖ్యను వాడచ్చు. అప్పుడు వర్చువల్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌కి మీ ఆధార్‌ నంబర్‌ను జత చేయాల్సిన అవసరం పడదు. 

4) రెగ్యులర్‌గా తనిఖీ 
మీ ఆధార్‌ ధ్రువీకరణకు UIDAI పోర్టల్‌కి వెళ్లి, ప్రామాణీకరణను తనిఖీ చేయాలి. మీ భద్రత– సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి UIDAI  ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు తెలుసుకోవాలి. 
ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో మరొక ఆధార్‌ కార్డ్‌ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఇది సాధారణంగా మూడు దశల ప్రక్రియలో ఉంటుంది. 

మూడు దశల ప్రక్రియ
దశ 1: అధికారిక UIDAI  పోర్టల్‌కి వెళ్లి, వెబ్‌సైట్‌లో కుడివైపు ఎగువన, డ్రాప్డౌన్‌ మెనూ నుండి  "My Aadhaar'  ను ఎంచుకోవాలి.
దశ 2: ఆధార్‌ నంబర్‌ని ధ్రువీకరించాలి. ఎంపికను ఎంచుకొని, మీరు దీన్ని ‘ఆధార్‌ సర్వీసెస్‌’ విభాగంలో కనుక్కోవాలి.
దశ 3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు క్యాప్చాతో పాటు 12అంకెల ఆధార్‌ నంబర్‌(UDI)ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని నమోదు చేసిన తర్వాత, దిగువన ఉన్న ‘ధ్రువీకరణకు’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఇది మీకు మరో ఆధార్‌ కార్డ్‌ చెల్లుబాటు స్థితిని సూచించే పేజీని చూపుతుంది. ఈ కార్డును eKYcకే ఉపయోగిస్తారు. 

ఆధార్‌ స్కామ్‌ల బారిన పడకుండా... 
►మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.. ఫోన్‌ ద్వారా ఆధార్‌ కార్డ్, ఇతర వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి.
►భారతదేశంలో ఆధార్‌ కార్డుకు సంబంధించిన మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అమాయకుల నుండి డబ్బును స్వాహా చేసేందుకు స్కామ్‌స్టర్లు కొత్త, వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆధార్‌ స్కామ్‌ల కారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. 

►ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్స్‌ (AIBOC)  మాజీ జనరల్‌ సెక్రటరీ డి థామస్‌ ఫ్రాంకో వాట్సాప్‌లోని బ్యాంకింగ్‌ గ్రూప్‌లో సంభాషణ రూపంలో ఈ హెచ్చరిక వచ్చింది, ఇందులో ఒక అమాయక ఆధార్‌ కార్డ్‌ హోల్డర్‌ తన మొత్తాన్ని వదులుకోవడానికి మోసగించిన సంఘటనలను వివరించాడు. బ్యాంకు అధికారిగా నటిస్తున్న స్కామ్‌స్టర్ల ద్వారా ఖాతాదారుల డబ్బు లావాదేవీలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. 

►కిందటేడాది డిసెంబర్‌ 21న జరిగిన ఒక సంఘటనలో, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  మేనేజర్‌గా నటిస్తున్న వ్యక్తి నుండి డాక్టర్‌ లాల్మోహన్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ వ్యక్తి అతని ఆధార్‌ నంబర్‌ కోసం డాక్టర్‌ లాల్మోహన్‌ను అడిగి, మొదట రూ. 5,000 ఆ పై రూ. 20,000 బదిలీ చేశాడు. అతని ఖాతా బ్లాక్‌ చేసిన తర్వాత కూడా నగదు బదిలీలు జరిగాయి. డాక్టర్‌ లాల్మోహన్‌ తన పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పనప్పటికీ, స్కామ్‌స్టర్లు అతని ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్‌ లేదా OTP  అవసరం లేకుండా

►నేరుగా అతని బ్యాంక్‌ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు తేలింది. 
మీకు అనుమానంగా ఉంటే వెంటనే ఖాతాతో లింక్‌ చేయబడిన ఆధార్‌ను డీ లింక్‌ చేయమని వెంటనే బ్యాంక్‌ని అడగాలి. మీ ఆధార్‌ నంబర్, పాస్‌వర్డ్‌ లేదా ఏదైనా బ్యాంకింగ్‌ వివరాలను ఫోన్‌లో ఎవరితోనూ పంచుకోవద్దు. 

-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top