విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు.
పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది.
దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్‌సైజ్ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగస్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావన కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామిలీ రిలేషన్స్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
స్ట్రెంత్ ట్రైనింగ్‌తో అతివల గుండె పదిలం
వారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్ ట్రైనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామాలన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు.
అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజులతోపాటు ఏరోబిక్ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద అమెరిన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్ ప్రచురించింది.
6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం
మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశోధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపుణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదాయం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది.
1 జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం.
2 జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం.
3 స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం.
4 ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.
5 స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.
6 ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం.


