ఫండే
పిల్లల కథ
సుందరవనం అనే అడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులకు దగ్గరవ్వాలనుకున్న ప్రతిసారీ తన వంశనైజాన్ని గుర్తు చేస్తూ దూరంగా పోతుండేవి. ఒకసారి ఆ అడవికి కరువు వచ్చింది. కుందేళ్ళ గుంపు పడరాని పాట్లు పడసాగాయి. అది చూసి నక్క చలించిపోయింది. వాటికి సాయం చేయడం ద్వారా తన మంచితనాన్ని రుజువు చేసుకోవాలని తలచింది. ఒకరోజు నక్క, కోతి దగ్గరకు పోయి ‘నాకు చెట్లెక్కే విద్య నేర్పించవా?’ అని అడిగింది.
నక్క వైపు వింతగా చూసిన కోతి, ‘పక్షుల గూళ్ళలో ఉన్న గుడ్లు దొంగతనం చేయడానికా?’ అని వెకిలిగా అడిగింది.
‘మంచికోసం విద్య నేర్పమంటే చెడును అంటగడతావేమి?’ కోపంగా అంది నక్క.
‘ఏమిటా మంచి?’ వెటకారంగా ప్రశ్నించింది కోతి.
‘కుందేళ్ళు చెట్లు ఎక్కలేవుగా, పళ్ళు తెంపి వాటికి సాయపడదామని...’ చెప్పింది నక్క.
‘పళ్ళు ఎరవేసి వాటిని చంపి తిందామనా?’ ఈసారి అడిగింది కోతి. నాలో మంచిని చూడలేని నిన్ను విద్య నేర్పమని అడగడం నా బుద్ధి తక్కువ’ అని ముందుకు పోయింది నక్క.
కొంత దూరం పోయాక అడవి పంది కనిపించింది.
‘పంది మామా! నేల నుంచి దుంపలు సేకరించే విద్య నేర్పించవా?’ అడిగింది.
‘నక్క బావా! ఎప్పట్నుంచి శాకాహారానికి మారావు?’ అడిగింది పంది.
‘నా గురించి కాదు కుందేళ్ళకు దుంపలిచ్చి సాయపడదామని...’ చెప్పింది నక్క.
‘కుందేళ్ళ మాంసమంటే నీకు అంత ఇష్టమా?’ అడిగింది పంది.
‘నేను సాయం అంటే నువ్వు మాంసం అంటావేమిటి?’ అడిగింది నక్క.
‘నీ సాయం ఊరికే ఉంటుందా?’ నిష్టూరంగా అంది పంది. నక్కకు కోపం వచ్చింది.
అక్కడి నుంచి తిన్నగా మృగరాజు దగ్గరకు వెళ్ళింది.
‘మృగరాజా! నేను మంచిగా బతకాలనుకున్నా ఎవరూ నమ్మడం లేదు. నన్ను అనుమానంతో అవమానిస్తున్నారు’ బాధపడుతూ చెప్పింది నక్క.
‘సాయం చేయాలన్న ఆలోచన రావడం గొప్ప విషయం. మంచిపని చేసినప్పుడు అడ్డంకులు రావడం సహజం. వాటిని అధిగమించాలంటే, అందరికీ ఉపయోగపడే పనిని నిస్వార్థంగా చేయాలి. కనిపించకుండా చేసే సాయం అందరి హృదయాలను కదిలిస్తుంది’ హితబోధ చేసింది సింహం.
బాగా ఆలోచించిన నక్క, మృగరాజు వద్ద సెలవు తీసుకొని అడవి జంతువులకు దూరంగా వెళ్ళిపోయింది. నక్క చాలా రోజులుగా కనిపించకపోవడంతో ఏమైపోయిందో అని అడవి జంతువులన్నీ అనుకున్నాయి. మృగరాజు పుట్టినరోజు వచ్చింది. అడవి జంతువులన్నీ శుభాకాంక్షలు చెప్పడానికి మృగరాజుని కలిశాయి. ‘ఈమధ్య కాలంలో వేటగాళ్ళ అలికిడి లేకుండా నిశ్చింతగా బతుకుతున్నాం. మానవుల రాకపోకలు తగ్గిన ఈ అడవి చెట్టు చేమ పెరిగి దట్టంగా మారింది. ఋతుధర్మాలు సక్రమంగా సాగుతూ కరువుకాటకాలకు దూరంగా ఉన్నామంటే, అంతా మీ చలవే! మృగరాజు గర్జన ఈ అడవికి రక్షణ. మరో వంద పుట్టినరోజులు జరుపుకొని మమ్మల్ని పాలించండి’ అంటూ శుభాకాంక్షలు చెప్పాయి.
‘ఇది నా గొప్పతనం కాదు. మీ అందరి క్షేమం కోసం ఓ జంతువు అడవి సరిహద్దుల్లో కాపు కాసుకొని జీవిస్తోంది. వేటగాళ్ళు అలికిడి వినిపించగానే, పరుగుతో తొలుత ఆ సమాచారం నాకు అందజేస్తోంది. నా గర్జనతో వేటగాళ్ళు ఇంటిముఖం పడుతున్నారు. ఆ జంతువును సత్కరించాలని అనుకుంటున్నాను. మీరేమంటారు?’ అడిగింది మృగరాజు.
‘మా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని ఆ జంతువు సేవలు అమూల్యమైనవి. నిజంగా సత్కరించవలసిందే!’ ముక్తకంఠంతో అన్నాయి. గుహ లోపల ఉన్న నక్కను పిలిచింది మృగరాజు. నక్కను చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.
‘మృగరాజా! నాకు సత్కారం అవసరం లేదు. సలహాతో సేవా ధర్మాన్ని తెలియజేసిన మీకు రుణపడి ఉంటాను’ చెమర్చిన కళ్ళతో అంది నక్క. జంతువులన్నీ నక్క సేవాగుణాన్ని వేనోళ్ళ పొగిడాయి.
- బి.వి.పట్నాయక్
హితవచనం..
వ్యాధితస్యర్థహీనస్య దేశాంతర్గతస్య
నరస్య శోకదగ్ధస్య సుహృద్దర్శనమౌషధం
వ్యాధిగ్రస్థుడికి, ధననష్టం పొందిన వాడికి, దేశాంతరాలలో ఉన్నవాడికి, అష్టకష్టాలలో మునిగి శోకంతో కుమిలిపోతున్న వాడికి ఒక సజ్జనుడు కనిపించినట్లయితే, ఆ సజ్జన సందర్శనమే దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: మరుత్తుడు ఎందుకు సర్పాలన్నింటినీ సంహరించాడు?


