breaking news
BV Patnaik
-
మంచితనానికి ప్రచారం అవసరమా?
సుందరవనం అనే అడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులకు దగ్గరవ్వాలనుకున్న ప్రతిసారీ తన వంశనైజాన్ని గుర్తు చేస్తూ దూరంగా పోతుండేవి. ఒకసారి ఆ అడవికి కరువు వచ్చింది. కుందేళ్ళ గుంపు పడరాని పాట్లు పడసాగాయి. అది చూసి నక్క చలించిపోయింది. వాటికి సాయం చేయడం ద్వారా తన మంచితనాన్ని రుజువు చేసుకోవాలని తలచింది. ఒకరోజు నక్క, కోతి దగ్గరకు పోయి ‘నాకు చెట్లెక్కే విద్య నేర్పించవా?’ అని అడిగింది.నక్క వైపు వింతగా చూసిన కోతి, ‘పక్షుల గూళ్ళలో ఉన్న గుడ్లు దొంగతనం చేయడానికా?’ అని వెకిలిగా అడిగింది.‘మంచికోసం విద్య నేర్పమంటే చెడును అంటగడతావేమి?’ కోపంగా అంది నక్క.‘ఏమిటా మంచి?’ వెటకారంగా ప్రశ్నించింది కోతి.‘కుందేళ్ళు చెట్లు ఎక్కలేవుగా, పళ్ళు తెంపి వాటికి సాయపడదామని...’ చెప్పింది నక్క.‘పళ్ళు ఎరవేసి వాటిని చంపి తిందామనా?’ ఈసారి అడిగింది కోతి. నాలో మంచిని చూడలేని నిన్ను విద్య నేర్పమని అడగడం నా బుద్ధి తక్కువ’ అని ముందుకు పోయింది నక్క.కొంత దూరం పోయాక అడవి పంది కనిపించింది.‘పంది మామా! నేల నుంచి దుంపలు సేకరించే విద్య నేర్పించవా?’ అడిగింది.‘నక్క బావా! ఎప్పట్నుంచి శాకాహారానికి మారావు?’ అడిగింది పంది.‘నా గురించి కాదు కుందేళ్ళకు దుంపలిచ్చి సాయపడదామని...’ చెప్పింది నక్క.‘కుందేళ్ళ మాంసమంటే నీకు అంత ఇష్టమా?’ అడిగింది పంది.‘నేను సాయం అంటే నువ్వు మాంసం అంటావేమిటి?’ అడిగింది నక్క.‘నీ సాయం ఊరికే ఉంటుందా?’ నిష్టూరంగా అంది పంది. నక్కకు కోపం వచ్చింది.అక్కడి నుంచి తిన్నగా మృగరాజు దగ్గరకు వెళ్ళింది. ‘మృగరాజా! నేను మంచిగా బతకాలనుకున్నా ఎవరూ నమ్మడం లేదు. నన్ను అనుమానంతో అవమానిస్తున్నారు’ బాధపడుతూ చెప్పింది నక్క.‘సాయం చేయాలన్న ఆలోచన రావడం గొప్ప విషయం. మంచిపని చేసినప్పుడు అడ్డంకులు రావడం సహజం. వాటిని అధిగమించాలంటే, అందరికీ ఉపయోగపడే పనిని నిస్వార్థంగా చేయాలి. కనిపించకుండా చేసే సాయం అందరి హృదయాలను కదిలిస్తుంది’ హితబోధ చేసింది సింహం.బాగా ఆలోచించిన నక్క, మృగరాజు వద్ద సెలవు తీసుకొని అడవి జంతువులకు దూరంగా వెళ్ళిపోయింది. నక్క చాలా రోజులుగా కనిపించకపోవడంతో ఏమైపోయిందో అని అడవి జంతువులన్నీ అనుకున్నాయి. మృగరాజు పుట్టినరోజు వచ్చింది. అడవి జంతువులన్నీ శుభాకాంక్షలు చెప్పడానికి మృగరాజుని కలిశాయి. ‘ఈమధ్య కాలంలో వేటగాళ్ళ అలికిడి లేకుండా నిశ్చింతగా బతుకుతున్నాం. మానవుల రాకపోకలు తగ్గిన ఈ అడవి చెట్టు చేమ పెరిగి దట్టంగా మారింది. ఋతుధర్మాలు సక్రమంగా సాగుతూ కరువుకాటకాలకు దూరంగా ఉన్నామంటే, అంతా మీ చలవే! మృగరాజు గర్జన ఈ అడవికి రక్షణ. మరో వంద పుట్టినరోజులు జరుపుకొని మమ్మల్ని పాలించండి’ అంటూ శుభాకాంక్షలు చెప్పాయి.‘ఇది నా గొప్పతనం కాదు. మీ అందరి క్షేమం కోసం ఓ జంతువు అడవి సరిహద్దుల్లో కాపు కాసుకొని జీవిస్తోంది. వేటగాళ్ళు అలికిడి వినిపించగానే, పరుగుతో తొలుత ఆ సమాచారం నాకు అందజేస్తోంది. నా గర్జనతో వేటగాళ్ళు ఇంటిముఖం పడుతున్నారు. ఆ జంతువును సత్కరించాలని అనుకుంటున్నాను. మీరేమంటారు?’ అడిగింది మృగరాజు. ‘మా ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని ఆ జంతువు సేవలు అమూల్యమైనవి. నిజంగా సత్కరించవలసిందే!’ ముక్తకంఠంతో అన్నాయి. గుహ లోపల ఉన్న నక్కను పిలిచింది మృగరాజు. నక్కను చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.‘మృగరాజా! నాకు సత్కారం అవసరం లేదు. సలహాతో సేవా ధర్మాన్ని తెలియజేసిన మీకు రుణపడి ఉంటాను’ చెమర్చిన కళ్ళతో అంది నక్క. జంతువులన్నీ నక్క సేవాగుణాన్ని వేనోళ్ళ పొగిడాయి.- బి.వి.పట్నాయక్హితవచనం..వ్యాధితస్యర్థహీనస్య దేశాంతర్గతస్యనరస్య శోకదగ్ధస్య సుహృద్దర్శనమౌషధంవ్యాధిగ్రస్థుడికి, ధననష్టం పొందిన వాడికి, దేశాంతరాలలో ఉన్నవాడికి, అష్టకష్టాలలో మునిగి శోకంతో కుమిలిపోతున్న వాడికి ఒక సజ్జనుడు కనిపించినట్లయితే, ఆ సజ్జన సందర్శనమే దివ్యౌషధంలా పనిచేస్తుంది.ఇదీ చదవండి: మరుత్తుడు ఎందుకు సర్పాలన్నింటినీ సంహరించాడు? -
దిద్దుబాటు
పిల్లల కథ వీరవర్మ అనే ముక్కోపి అవంతీపురాన్ని పాలించేవాడు. మంత్రులు, సేవకులు తరచూ అతడి ఆగ్రహాన్ని చవిచూస్తుండేవారు. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేనన్న సత్యాన్ని గ్రహించిన తెలివిగల మంత్రులు నిత్యం అతడిని పొగడటం అలవాటు చేసుకున్నారు. పొగడ్తల మత్తులో వీరవర్మ నెమ్మదిగా మంత్రుల దారిలోకి వచ్చాడు. కొన్నాళ్లకు పొగడ్తలు విననిదే నిద్రపట్టని స్థితికి చేరుకున్నాడు. ఇలా రోజులు గడుస్తుండగా, వర్షాకాలం వచ్చింది. రాజ్యంలో నదులన్నీ పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి. సహాయక చర్యలు ప్రారంభించేలోగానే, వాటిలో తలెత్తబోయే లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మంత్రులందరూ పొగడ్తలు అందుకున్నారు. ‘ప్రభూ! మీ కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండబట్టే నదులు కూడా ఆనందంతో ఉప్పొంగి మీకు జేజేలు పలుకుతున్నాయి.. ’ అంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించారు ఇంతలో వచ్చిన అధికారులు.. వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వీరవర్మకు వివరించారు. సహాయక చర్యలకు కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకు వెళ్లమని ఆదేశించాడు వీరవర్మ. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, పంటలు పోగొట్టుకున్న వారికి నష్టపరిహారం, వ్యాధుల బారిన పడ్డ వారికి వైద్య సౌకర్యాలు.. మొత్తానికి వీటి ఖర్చులు ఖజానాపై పెనుభారాన్నే మోపాయి. ‘ప్రభూ! వరదలు వచ్చిన వెంటనే మీరు స్పందించే తీరు దేవునికైనా సాధ్యం కాదేమో? ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే రాజాధిరాజులు మీరు!’ అంటూ మళ్లీ పొగిడారు మంత్రులు.. ఆ పొగడ్తకు వీరవర్మ పులకించిపోయాడు. ఏడాది గడచింది. ఇప్పుడు రాజ్యం కరువు బారినపడింది. పంటలు పండలేదు సరికదా, ప్రజలు దాహం తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ‘ప్రభూ! మేఘుడు మీ రాజసానికి అసూయ చెంది పారిపోయాడు. ఈ దుర్భిక్షాన్ని గట్టెక్కించే ధీరులు తమరు మాత్రమే’ అంటూ పొగడ్తలు లంకించుకున్నారు మంత్రులు. ‘కరువు నివారణ ఇప్పటికిప్పుడు అసాధ్యం. పొరుగు రాజ్యాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోండి. కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకోండి’ అంటూ ఫర్మానా జారీ చేశాడు వీరవర్మ. దీంతో ఖజానా ఖాళీ అయినా కరువు సమస్య తీరింది. యథాప్రకారం పొగడ్తలు అందుకున్నారు మంత్రులు.. వాటిని వీరవర్మ వీనులవిందుగా ఆస్వాదించాడు. మరో ఏడాది గడచింది. ఈసారి ప్రకృతి అనుకూలించి, పంటలు బాగానే పండాయి. ఖజానా నింపుకోవడానికి ఇదే తగిన తరుణం అనుకున్న వీరవర్మ ప్రజలపై ఎడాపెడా పన్నులు వడ్డించాడు. ‘పన్ను’పోటుకు ప్రజలు చిర్రెత్తిపోయారు. ప్రజాగ్రహం ముందు మంత్రుల పొగడ్తలు పనిచేయలేకపోయాయి. పరిస్థితి విషమించడంతో వీర వర్మ నేరుగా ప్రజలతో ముఖాముఖి అయ్యాడు. ‘ప్రభూ! మొదటి సంవత్సరం వరదల రూపంలో ప్రకృతి మనకు నీరు ప్రసాదించింది. దూరదృష్టితో ఆనకట్టలు నిర్మించి నీటిని నిల్వ ఉంచి ఉంటే, వరంగా మారేది. అలా నిర్మించకపోవడంతో అది శాపమై, నష్టాన్ని మిగిల్చింది. ఆ నీరే నిల్వ ఉంటే రెండో సంవత్సరంలో వచ్చిన కరువుకు తక్షణ నివారణగా ఉపయోగపడేది. ప్రజలకూ నష్టం తప్పేది’ అన్నాడు ఒక పౌరుడు. మరొక పౌరుడు లేచి, ‘ప్రభూ! ప్రభుత్వ సాయం అంతంత మాత్రమేనని మీకు తెలియంది కాదు. అధిక పన్నులు మమ్మల్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఆదుకుంటే ఖజానా ఎప్పటికైనా నిండే అవకాశం ఉంటుంది’ అన్నాడు. విమర్శలన్నీ వీరవర్మకు శూలాల్లా గుచ్చుతున్నాయి. వాటిలో వాస్తవం ఉండటంతో ఆలోచనలో పడ్డాడు. ప్రజాగ్రహం తిరుగుబాటుగా మారక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలనుకున్నాడు. పన్నులు తగ్గించాడు. పౌరుల శ్రమశక్తితో రాజ్యాభివృద్ధికి బాటలు వేయడం ప్రారంభించాడు. కొద్దిరోజులకే మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు వీరవర్మ. - బి.వి.పట్నాయక్


