వింటర్‌లో వంటిల్లూ ఔషధాలగనిలా ఉండాలి. తక్షణ శక్తినిచ్చేవి, రోగనిరోధక శక్తిని పెంచే వంటకాల జాబితాను సిద్ధం చేసుకోవాలి. జింజర్ వెజిటబుల్ సూప్, క్వినోవా రోస్టెడ్ వెజిటబుల్, చికెన్ పెప్పర్ రసం.. వంటకాలతో నేటి వంటిల్లు.
చికెన్ పెప్పర్ రసం
కావలసినవి:
మిరియాలు: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; బోన్ లెస్ చికెన్ – 250 గ్రా.లు; జీలకర్ర – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; టొమాటో – 3; పసుపు – అర టీస్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 8; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేయాలి); ఉప్పు – రుచికి తగినంత; చింతపండు – నిమ్మకాయ పరిమాణం (నీళ్లలో నానబెట్టి, రసం తీయాలి); నీళ్లు – 4 కప్పులు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;
తయారీ:
⇒ బాణలి వేడయ్యాక అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి, సన్నని మంట మీద దోరగా వేయించుకుని, పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడి చేసుకోవాలి
⇒ టొమాటో ముక్కలు, పసుపు వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్ చేసుకోవాలి
⇒ వెడల్పాటి గిన్నె స్టౌ పై పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, వేయించాక శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలపాలి
⇒ చికెన్ రంగు మారే వరకు ఐదు నిమిషాలు వేయించిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసి కలపాలి. దీంట్లో టొమాటో గుజ్జు, చింతపండు రసం పోసి కలపాలి
⇒ అవసరమైనన్ని నీళ్లు పోసి, మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికేంతవరకు సన్నని మంట మీద ఉంచాలి. నూనె పైకి తేలుతూ, ఘుమఘుమలాడే వాసన వస్తుండగా చివరగా కొత్తిమీర చల్లి, వేడి వేడిగా వడ్డించాలి.
జింజర్ వెజిటబుల్ సూప్
రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు చేసినప్పుడు ఈ సూప్ మంచి రిలీఫ్‌నిస్తుంది.
కావలసినవి:
ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; అల్లం ముక్క – సన్నగా తరగాలి; పసుపు – పావు టీ స్పూన్; క్యారెట్ – 1 (సన్నగా తరగాలి); బంగాళదుంప – 1 ( సన్నగా తరగాలి); పాలకూర తరుగు – కప్పు; నీళ్లు – 4 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; మిరియాల పొడి – పావు టీ స్పూన్.
తయారీ:
⇒ కడాయిలో ఆలివ్ ఆయిల్ వేడి చేసి, అల్లం వేసి వేగుతుండగానే దీంట్లో కూరగాయల తరుగు, పసుపు వేసి 2–3 నిమిషాలు వేయించాలి
⇒ నీళ్లు పోసి, కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఉప్పు వేసి కలపాలి
⇒ చివరగా పాలకూర వేసి, 5 నిమిషాలు ఉడికించి, మిరియాల పొడి చల్లి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
క్వినోవా రోస్టెడ్ వెజిటబుల్
ఈ వంటకం ద్వారా ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.
కావలసినవి: క్వినోవా (ఉడికించినది) – కప్పు; క్యారెట్ – 1; చిలగడదుంప – 1; క్యాప్సికమ్ – 1; ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; జీలకర్ర – పావు టీ స్పూన్; నల్ల మిరియాలు – 6; పనీర్ క్యూబ్స్ – 4–6; నిమ్మరసం – పావు టీ స్పూన్;
తయారీ:
⇒ కూరగాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి, వేయించి, పక్కనుంచాలి
⇒ అదే బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి, జీలకర్ర, మిరియాలు వేసి కలపాలి. దీంట్లో కూరగాయల ముక్కలు, వండిన క్వినోవా, పనీర్ క్యూబ్స్ వేసి కలపాలి
⇒ చివరగా నిమ్మరసం కలిపి, వడ్డించాలి.
చదవండి: మైండ్‌ఫుల్ కిచెన్ మూమెంట్


