breaking news
Cookery page
-
70 ఏళ్ల వయసులో యూట్యూబ్ సెన్సేషన్
అందమైన తెలంగాణ భాషతో మన దగ్గర గంగవ్వ యూట్యూబ్ స్టార్ అయ్యింది. మహారాష్ట్రలో 70 ఏళ్ల వయసులో గత ఆరు నెలల్లో సుమన్ ధమానే భారీ యూట్యూబ్ స్టార్‌గా మారింది. ‘ఆప్లీ ఆజీ’ (మన అవ్వ) పేరుతో ఆమె మొదలెట్టిన వంటల యూట్యూబ్ చానల్‌కు 6 లక్షల మంది సబ్స్క్రయిబర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ ఆమె చానల్‌కు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. కొంచెం సంప్రదాయ కారం, కాసింత అనుభవాల ఉప్పు, చిటికెడు దేశీయ నైపుణ్యం, గుప్పెడు ఆత్మీయ అలంకారంతో ఆమె చేసే వంటకు అభిమానులు కొల్లలు. ఇదంతా జనవరి, 2020లో మొదలయ్యింది. మహారాష్ట్రలోని అహమద్ నగర్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ‘సరోలా కసర్’ అనే ఊరిలో వ్యవసాయ పనులు చేసుకునే 70 ఏళ్ల సుమన్ ధమానేతో ఇంటర్ చదువుతున్న ఆమె మనవడు ఆ రోజు ‘పావ్ భాజీ’ చేసి పెట్టమన్నాడు. ఎలా చేయాలో యూ ట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూపెట్టాడు. వాటిని చూసిన ధమానే ‘పిచ్చోడా. నేను వాళ్ల కంటే బాగా చేస్తాను చూడు’ అని పావ్ భాజీ చేసి పెట్టింది. ‘ఆమె ఏమి నూరిందో, ఏమి కలిపిందో తెలియదుగాని ఆ రుచి మాత్రం అద్భుతం’ అని మనవడు, ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తిన్నారు. అప్పుడే మనవడికి ఎవరో చేసిన వీడియోలు నేను చూడటం ఎందుకు, మా నానమ్మ చేసే వీడియోలనే అందరికీ చూపిద్దాం అని అనిపించింది. కాని రెండు నెలలు పని ముందుకు జరగలేదు. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఎవరూ బయటకు కదలడానికి లేదు. ‘మనం వంటలు చేద్దామా నానమ్మా’ అని అడిగాడు మనవడు. కాకర కాయ కూర ఎవరైనా ముందు తీపితో మొదలెడతారు. కాని సుమన్ ధమానే చేదుతోనే మొదలెట్టింది. మనవడు ఒక వంట చేసి చూపించు, వీడియో అప్లోడ్ చేస్తాను అంటే మొదట కాకర కాయ కూర వండింది. ఆమె ఏమీ చదువుకోలేదు. ఎప్పుడూ కెమెరాను ఫేస్ చేయలేదు. కాని ఆమె వేళ్లకు వంట భాష తెలుసు. ఆ భాషతోనే మాట్లాడింది. నవ్వుతూ ఉన్న ముఖంతో సుమన్ ధమానే చేసిన కాకరకాయ కూర మార్చి, 2020లో మొదటిసారి యూట్యూబ్‌లో వీడియోగా ప్రత్యక్షమైనప్పుడు వెంటనే దానికి లైకులు పడ్డాయి. అందరూ చూడటం మొదలెట్టారు. ఆ మరుసటి వీడియోను ‘పల్లీల చట్నీ’గా చేసి పెట్టింది. దానికీ బోలెడన్ని వ్యూస్ వచ్చాయి. ఇక ఆమె బండి ఆగలేదు. అడ్డంకులు దాటి ఇంటర్ చదివే మనవడు ఒక్కడే మొత్తం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ చేశాడు. చేస్తున్నాడు. కొత్తల్లో టెక్నికల్ విషయాల అడ్డంకి, నెట్ ప్రాబ్లమ్, ధమానె బెరుకు ఇవన్నీ ఇబ్బంది పెట్టాయి. కాని మెల్లమెల్లగా అవ్వా మనవడు తాము ఏం చేయాలో తెలుసుకున్నారు. వరుస పెట్టి వంటలు చేశారు. ధమానే ఏం చేసిందంటే అప్పటికప్పుడు ఇంట్లో నూరుకునే పదార్థాలతో ఆ వంటలు చేసి చూపెట్టింది. మహారాష్ట్ర ప్రజలు మర్చిపోయిన పాత వంటలను చేసి పెట్టింది. లాక్డౌన్ వల్ల ఇళ్లల్లో ఉంటున్న స్త్రీ పురుషులందరూ ఇవాళ కొత్తగా ఏం ట్రై చేద్దాం అని ధమానె వీడియోలు చూడసాగారు. నాలుగు నెలల్లో ధమానేకు 6 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. ఇప్పటికి ధమానె 140 వీడియోలు పెట్టింది. సాబూదానా కిచిడి, మసాలే భాత్, బటాటా వడ, పానిపూరి, రగ్డా... ఇవన్నీ ఆమె ఎలా చేసిందో వీడియోలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి దాదాపు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. అసలైన వంటవాళ్లు టీవీలలో వంటల ప్రోగ్రామ్స్‌ను ‘క్వాలిఫైడ్ చెఫ్స్’ చేస్తుంటారు. కాని భారతదేశంలో అమ్మమ్మలు, నానమ్మలకు మించిన క్వాలిఫైడ్ చెఫ్స్ ఉండరు. వీరికి నిన్నమొన్నటి వరకు టీవీలలో ప్రవేశం ఉండేది కాదు. కాని యూ ట్యూబ్ పుణ్యమా అంటూ వీరి వంట ప్రావీణ్యం లోకానికి తెలుస్తూ ఉంది. 70 ఏళ్ల వయసులో ఏ పని చేయగలం అని చాలామంది అనుకోవచ్చు. కాని సుమన్ ధమానె ఈ వయసులోనే స్టార్ అయ్యింది. ఆమె చేస్తున్న వంటలకు యూ ట్యూబ్ నుంచి మంచి పారితోషికం కూడా అందుతోంది. వేలల్లో ఆదాయం గడిస్తోంది. వంట తెలిసిన అవ్వలు ఎందరో. ఇక చేయాల్సింది కెమెరా ఎదురుగా గరిటె అందుకోవడమే. అవ్వ మసాలాలు ‘ఆప్లీ ఆజీ’ యూట్యూబ్ చానల్లో సుమన్ ధమానే వంట చేస్తూ వాడుతున్న మసాలాలకు డిమాండ్ ఏర్పడింది. అవి మా ఊళ్లల్లో అంత స్వచ్ఛంగా దొరకడం లేదు... మీరు పంపితే కొంటాం అని చాలామంది అడుగుతుంటే ధమానేనే బ్రాండ్ అంబాసిడర్‌గా మసాలాల విక్రయం కూడా మొదలైంది. ఆమె మసాలాలకు ఆర్డర్ పెడుతున్నవారు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
రీడర్స్ కిచెన్
ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి.ఈ వారం తెలుగువారికి ఎంతో ఇష్టమైన ‘వంకాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి.