ఈ ఫొటోను చూస్తే, డ్రంకెన్ డ్రైవ్ కేసులా అనిపిస్తోంది కదూ! మీరు అనుకుంటున్నట్లుగా ఇది డ్రంకెన్ డ్రైవ్ కేసు కాదు. గొట్టం ముందు గాలి ఊదుతున్న వ్యక్తి తప్పతాగి బండి నడుపుతూ పోలీసులకు చిక్కిన శాల్తీ కాదు, ఆస్పత్రిలో క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటున్నాడు. క్యాన్సర్ నిర్ధారణకు శ్వాసతో పరీక్ష ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఇది క్యాన్సర్ పరీక్షే! ఇప్పటి వరకు క్యాన్సర్ నిర్ధారణకు చిన్నపాటి కోతతో కూడిన బయాప్సీ పరీక్షలు అవసరమయ్యేవి.
ఇప్పుడు కేవలం శ్వాస ఊదితే చాలు, నిశ్వాస ద్వారానే క్యాన్సర్ ఉనికిని గుర్తించగల క్యాన్సర్ బ్రీతలైజర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇది అచ్చంగా డ్రంకెన్ డ్రైవ్ కోసం పోలీసులు ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్‌లాగానే ఉంటుంది. అయితే, ఇది శ్వాసలోని ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్’ను గుర్తించి, వాటి ఆధారంగా క్యాన్సర్ నిర్ధారణ చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ‘ఔల్‌స్టోన్ మెడికల్’ ఈ బ్రీతలైజర్‌ను రూపొందించింది.
దీని ద్వారా లంగ్ క్యాన్సర్, రకరకాల బ్లడ్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్లను సులువుగాను, చాలా ముందుగాను గుర్తించడానికి వీలవుతుంది. ఈ బ్రీతలైజర్ ద్వారా శ్వాస సేకరించిన గొట్టాన్ని ల్యాబొరేటరీకి పంపుతారు. ల్యాబ్ పరీక్షల్లో ఇందులోని ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్’ ఉనికిని గుర్తించి, వాటి ఆధారంగా క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. ఈ పరికరం విరివిగా అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ నిర్ధారణ సులభతరం అవుతుంది.
కొవ్వును కరిగించే నీరు!
అధిక బరువు, స్థూలకాయం జనాభాలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్యలు. జీవనశైలి వ్యాధుల్లో స్థూలకాయం కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి చాలామంది ఎన్నో తంటాలు పడుతుంటారు. వారానికి ఒకటి రెండో రోజులు ఉపవాసాలు చేస్తూ డొక్క మాడ్చుకోవడం; ఆచి తూచి కేలరీలు లెక్కించుకుని మరీ తింటూ డైటింగ్ చేయడం; జిమ్‌లకు వెళ్లి బరువులు మోయడం వంటి పనులు చేస్తుంటారు.
ఇన్ని చేసినా ఫలితం ఉండకుంటే, ఒంట్లోని కొవ్వును తీసేయించుకోవడానికి చివరకు శస్త్రచికిత్సలకు కూడా సిద్ధపడు తుంటారు. అయితే, ఒంట్లోని కొవ్వును కరిగించుకోవడానికి ఇన్ని తంటాలు అవసరమే లేదని జపానీస్ కంపెనీ చెబుతోంది. ‘మా నీళ్లు తాగండి... ఒంట్లోని కొవ్వును చిటికెలో ఇట్టే కరిగించుకోండి’ అని అట్టహాసంగా ప్రచారం చేసుకుంటోంది. ‘ఏ నీటిలో ఏ మహిమ ఉందో’ అనుకుంటూ జపాన్‌లోని స్థూలకాయులందరూ ఈ నీటి సీసాలను ఎగబడి కొని మరీ తాగుతున్నారు.
జపాన్‌లోని పానీయాల తయారీ కంపెనీ ‘సుంటోరీ’ ఇటీవల ‘తొకుసుయి’ పేరుతో ఈ నీటి బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘తొకుసుయి’ అంటే ప్రత్యేకజలం అని అర్థం. తౌడు నానబెట్టిన నీటిని వడగట్టి ఈ నీటిని సీసాలకు ఎక్కిస్తున్నారట! ఈ నీరు ఆరువందల మిల్లీలీటర్ల సీసా ధర 150 యెన్‌లు (రూ.86) మాత్రమే! ఈ నీరు తాగితే, శరీరంలోని జీవక్రియలు వేగం పుంజుకుని, కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ఈ నీటి మహిమ ఎంతటిదో దీనిని తాగిన వారే చెప్పాలి మరి!


