కువైట్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమేనని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
దేశంలోని అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు, పౌర రక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికీ ఈ పరీక్ష ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ డ్రిల్‌లో మూడు రకాల సైరన్లు వినిపించనున్నట్లు తెలిపారు. ప్రతి సైరన్‌కు ప్రత్యేక అర్థం ఉంటుందని వెల్లడించారు. మొదటి సైరన్ ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికగా, రెండోది ప్రమాదం కొనసాగుతున్నదని సూచికగా, మూడో సైరన్ ప్రమాదం ముగిసినట్లు తెలిపే సంకేతంగా ఉంటుందని అధికారులు వివరించారు.
ప్రజలు ఈ పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.


