
పుట్టినరోజున కేక్ కటింగ్‌లకు బదులు మొక్కలు నాటుతున్న విద్యార్థులు
బక్రి చేప్యాల ప్రభుత్వ పాఠశాల, లచ్చపేట మోడల్ స్కూల్‌లో గార్డెన్లు
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థులు
సాక్షి, సిద్దిపేట: పుట్టినరోజు వస్తుందంటేనే పిల్లలు ఎక్కడ లేని సంతోషంలో మునిగిపోతారు. బర్త్‌డే రోజు ఒక మంచిపని చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ ఆలోచనలోంచి అందమైన బర్త్ డే గార్డెన్‌లు పురుడు పోసుకున్నాయి. సిద్దిపేట జిల్లా బక్రి చేప్యాల జెడ్పీఉన్నత పాఠశాలతోపాటు దుబ్బాకలోని లచ్చపేట మోడల్ స్కూల్‌లోని విద్యార్థుల బర్త్ డే గార్డెన్‌లు (Birthday Garden) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బక్రి చేప్యాల పాఠశాల ఉపాధ్యాయులు, లచ్చపేట మోడల్ స్కూల్ సీసీఆర్‌టీ (సెంటర్ ఫర్ కల్చరల్, రిసోర్స్ అండ్ ట్రైనింగ్) క్లబ్ ఈ ఏడాది జూన్ 16న బర్త్ డే గార్డెన్‌లు ఏర్పాటు చేశాయి.
పాఠశాలల్లో ఎవరి పుట్టిన రోజు ఎప్పుడు అనేది తెలుసుకునేందుకు ప్రత్యేక రికార్డు బుక్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజు నాడు వారిచేత టీచర్ల గార్డెన్‌లో మొక్కను నాటిస్తున్నారు. ప్రతీ రోజు బ్రేక్ సమయంలో ఎవరి మొక్కకు ఆ విద్యార్థి నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి టీచర్లు కూడా తమ పుట్టిన రోజు సందర్భంగా గార్డెన్‌లో మొక్కలు నాటుతున్నారు. గార్డెన్ల పర్య వేక్షణ బాధ్యతను ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీచర్లకు అప్పగించారు.
పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంచాలని..
బర్త్ డే అంటే కేక్ కట్ చేయటం, చాక్లెట్లు పంచటమే కాదు... మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో బర్త్‌డే గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యత, ప్రేమ పెంచాలనే దీనిని ప్రారంభించాం. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేలా ప్రయత్నిస్తున్నాం. గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి మొక్కలు (Plants) తెప్పించి నాటిస్తున్నాం.
– నాగేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బక్రి చేప్యాల
పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాను
మా పాఠశాలలో ఏర్పాటుచేసిన బర్త్ డే గార్డెన్‌లో నా 14వ బర్త్‌డే సందర్భంగా గులాబీ మొక్కను నాటాను. రోజూ బ్రేక్ సమయంలో మొక్కకు నీళ్లు పోస్తున్నా. బర్త్ డే రోజు మొక్క నాటడం ఎంతో సంతోషంగా ఉంది.
– రక్షిత, 9వ తరగతి, బక్రి చేప్యాల