
ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...
శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ గుజరాత్‌కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు. బ్రహ్మాండమైన రెండు గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని కొనేందుకు ఆన్‌లైన్ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన వాఘేలా వనరాజ్‌భాయ్ శాంతిభాయ్‌ను సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్ మరో విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ గేదెల డెలివరీ మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్ ఎత్తడం మానేశాడు. దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
నిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు.
గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు.
ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్