
మద్యం వైపు మందుబాబుల చూపు
రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలలో క్షీణత
భగ్గుమంటున్న రేట్లే కారణం
కర్ణాటక, బెంగళూరు, బనశంకరి: బీరు తాగుదామని మందుబాబులు అనుకుంటే జేబుకు రంధ్రం పడుతోంది. చాలా మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి ఉండడంతో బీరు వద్దులే అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పథకాల నిధుల కోసం తరచుగా మద్యం, బీరు ధరలను పెంచడం మందుబాబులకు ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా బీర్లను తాగడం తగ్గించారు, ఫలితంగా రాష్ట్రంలో గత నాలుగునెలల్లో బీర్ విక్రయాలు 19.65 శాతం తగ్గాయి.
వేసవి నుంచి తగ్గుదల
సాధారణంగా వేసవిలో మద్యంప్రియులు మద్యానికి బదులు ఎక్కువగా బీర్లు తాగుతారు. నగర, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా బీర్‌కు ఓటేస్తారు. కానీ ఈ వేసవి నుంచి బీర్‌కు గిరాకీ క్షీణించింది. బీరు ధర ఎక్కువగా ఉందనే కారణంతో దేశీయ మద్యం వైపు మొగ్గుచూపారు. దీంతో మద్యంతో పోలిస్తే బీర్ విక్రయం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ నుంచి బీర్ల కొనుగోళ్లు తగ్గాయి.
భారీ స్థాయిలో..
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 1,420 లక్షల లీటర్ల (182.08 లక్షల బాక్సులు) బీర్లు విక్రయమయ్యాయి.
ఈ ఏడాది ఇదే అవధిలో 1,141 లక్షల లీటర్లు(146.30 లక్షల బాక్సులు) లే అమ్మారు.
గత ఏడాదితో పోలిస్తే భారీ మొత్తంలో తగ్గుదల నమోదైంది. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపుల్లో స్టాకు ఖాళీ కావడం లేదని చెబుతున్నారు.
ఎడాపెడా రేట్ల పెంపు
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంపు లక్ష్యంతో బడ్జెట్‌కు ముందే బీర్ ధరలను పెంచింది. జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చేలా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనివల్ల సాధారణం నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని బీర్ల ధరలు రూ.10 నుంచి 50 వరకు భగ్గుమన్నాయి. ఆల్కహాల్ అధికంగా ఉండే బీర్ల ధరలను మరింత పెంచేశారు. మే 15 నుంచి మరోసారి 5 శాతం పెంచారు. కాబట్టి అంత ధర పెట్టి బీరు తాగినా కిక్కు ఎక్కడం లేదని పానప్రియులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ బీర్ల కంపెనీలకు ఇస్తున్న కొనుగోలు ఆర్డర్లను కూడా కోత కోసింది. బెంగళూరు వంటి నగరాల్లో వర్షాకాలంలో బీర్లకు అధిక డిమాండ్ ఉంటుంది. యువతీ యువకులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు సేవించడం అధికం. కానీ సేల్స్ తిరోగమనంలో పడిపోయినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. ధరల పెంపు కారణమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.
మద్యం వాడకం కూడా
బీర్ తో పోలిస్తే దేశీయ మద్యం విక్రయాలు కూడా అంతగా పెరగలేదు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 2,164 లక్షల లీటర్ల ఐఎంఎల్ అమ్ముడైంది. ఈ ఏడాది ఇదే కాలంలో 2,135 లక్షల లీటర్లు విక్రయమైంది. బీర్లు, మద్యం కొనుగోళ్లు తగ్గినప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు, ఎందుకంటే ధరలు, పన్నుల పెంపుతో అనుకున్న దానికంటే ఎక్సైజ్‌శాఖ కు ఆదాయం పెరుగుతోంది. కానీ ధర పెంపుతో వ్యాపారాలు తగ్గినట్లు వైన్‌షాపుల ఓనర్లు వాపోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో మద్యం ప్రియులు చవగ్గా దొరికే బీర్లు, లేదా మద్యం తాగి పద అంటున్నారు. ప్రీమియం బ్రాండ్లు కొనేవారు స్థానిక సరుకుతో సరిపెట్టుకుంటున్నారు.