సూర్యుడికి పంచ్‌.. వీళ్లకి పోలీసుల పంచ్‌

Bathing of YouTuber and young woman on a scooter - Sakshi

సూర్యుడు, జనం ‘యూ హౌమచ్‌ అంటే యూ హౌమచ్‌’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్‌ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్‌ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్‌ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్‌ వెరైటీగా ఉందనుకోండి.  ఈ వైరల్‌ విశేషాలు...

మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్‌ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్‌ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు.

తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్‌ ముందు నీళ్ల బకెట్‌ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్‌ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్‌ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు.

థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్‌ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్‌ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్‌ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్‌ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్‌స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్‌మన్న యూ ట్యూబర్‌ ‘సారీ... హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్‌ కడతా’ అని వీడియో రిలీజ్‌ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్‌ చేసినందుకు కదా పోలీసులు ఫైన్‌ వేస్తారు. అది మర్చిపోయాడు.
ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top