
ఒక గాయకుడు మరణిస్తే జనం సముద్రంలా పోటెత్తడం జుబీన్ గార్గ్ అంతిమ యాత్రలో దేశం చూసింది. ఎవరీ జుబీన్ గార్గ్ అని ఆరా తీసింది. అతడు అస్సాం గొంతుక, అస్సాం సంగీతానికి గుండెకాయ. అభిమానులు ‘కింగ్ ఆఫ్ హమ్మింగ్’ అని పిలుచుకునే జుబీన్ గార్గ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ గర్వపడే సంగీత సముద్రం. గాయకుడు, సంగీత కారుడు, వాద్యకారుడు, సామాజిక సేవకుడు, దాత... ఇంకా మరెన్నో. ఇప్పటికి దాదాపు పదివేలకు పైగా పాటలు పాడి, రికార్డు చేసి స్థానిక గీతాలకు గొంతుకనిచ్చాడు. అంతేకాదు ప్రజల తరఫున అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వెనుకాడలేదు. అందుకే అతణ్ణి జనం గుండెల్లో పెట్టుకున్నారు.చని పోతే గుండెలు పగిలేలా ఏడ్చారు. ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘యాలీ... రహమ్ వాలీ’ పాట జుబిన్ పాడిందే.
జుబీన్ మెహతా అంతటి వాడు కావాలని...
జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నాడు. గార్గ్ అతని గోత్రనామం. తల్లి గాయని కావడం, తండ్రి కవి కావడంతో వారిద్దరి అంశతో వాగ్గేయకారుడు అయ్యాడు. క్షణాల్లో పాట కట్టి పాడగలడు. అందులో అస్సామీ సంస్కృతిని చూపిస్తాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ తదితర భాషల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాల స్థానిక భాషల్లో కూడా పాడాడు.
సింగపూర్‌లో జరుగుతున్న నార్త్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబిన్ సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. అతని పార్థివదేహం భారత్‌కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు అతన్ని ఆఖరిసారి చూసేందుకు ఎయిర్ పోర్ట్‌కు తరలి వచ్చారు. సెప్టెంబర్ 23న జరిగిన అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అతని స్మారక స్థూపం కోసం మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
అతని ప్రేమకథ
జుబీన్ గార్గ్‌కు వేలాది మంది అమ్మాయిలు ఫాన్స్‌గా ఉన్నారు. వారిలో ఒకమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గరిమా సైకియా. జుబిన్ ఆల్బమ్స్ ‘అనామిక’, ‘మాయ’ విని గరిమ ఆయనకు అభిమానిగా మారారు. ఆ సమయంలో ఆమె ముంబయిలో ఉన్నారు. ఇంటి నుంచి దూరంగా ఉంటూ, హోమ్‌సిక్ అనుభవిస్తున్న ఆమెకు ఆ పాటలు ప్రశాంతతను అందించాయి. తన అభిమానాన్ని ఓ ఉత్తరం రూపంలో రాసి ఆయనకు పంపారు. జుబీన్ తన అభిమానులకు ఎప్పుడూ ప్రత్యుత్తరం రాయలేదు. మొదటిసారి గరిమ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం రాశాడు.
వారి ప్రేమకు అక్కడే బీజం పడింది. ఆ తర్వాత కొంతకాలం ఉత్తరాల ద్వారా ప్రేమ బలపడింది. అయితే అన్ని ప్రేమకథల్లాగే వీరి ప్రేమకూ ఆటంకాలు తప్పలేదు. గరిమ కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ఆమె తండ్రి ససేమిరా అన్నారు. గరిమ సైతం జుబీన్ ప్రవర్తనతో కొంత విసిగి పోయారు. ఆయనకు దూరంగా ఉండటమే మంచిదని భావించి దూరంగా వెళ్లారు. ఆ తర్వాత జుబీన్ పరిస్థితి తలకిందులైంది.
దేని మీదా ఏకాగ్రత నిలవలేదు. ఆ ప్రభావం అతను చేస్తున్న పని మీద పడింది. పాటల్లో పస ఉండటం లేదని అభిమానులు పెదవి విరిచారు. డిప్రెషన్ చుట్టుముట్టింది. ఇదంతా విన్నాక గరిమ మనసు కరిగింది. ఒకరినొకరు విడిచి ఉండలేరని ఇద్దరికీ అర్థమై 2002 ఫిబ్రవరి 4న వివాహం చేసుకున్నారు. 23 ఏళ్లుగా వారి బంధం పటిష్ఠంగా ఉంది. ఉన్నట్టుండి జుబీన్ లేక పోవడాన్ని గరిమ జీర్ణించుకోలేక పోతున్నారు. వారిద్దరి ప్రేమ గురించి తెలిసినవారంతా కన్నీరు పెడుతున్నారు.
సమాజం కోసం కలిసి నడిచారు
జుబీన్ గార్గ్–గరిమ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ 15 మంది నిరుపేద పిల్లల్ని వారు దత్తత తీసుకొని, వారి ఆలనా పాలనా చూశారు. వీరిలో ‘కాజలి’ అనే పాప వారిద్దరికీ ఎంతో ప్రియమైన బిడ్డ. ఓరోజు జుబీన్ కారులో ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఓ చిన్నారి కనిపించింది. చిన్నవయసులో కూలి పనులు చేస్తూ యజమాని చేత తిట్లు తింటోంది. వెంటనే స్పందించిన జుబీన్ ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. తన బిడ్డగా దత్తత చేసుకున్నారు. అనంతరం ఆ పాపకు చదువు, పోషణ బాధ్యతంతా తానే తీసుకున్నారు. ఈ విషయంలో గరిమ ఆయనకు చేదోడుగా నిలిచారు. అలా తమ వద్దకు వచ్చి చేరిన 15 మంది పిల్లల్ని సొంత తల్లిలా పెంచుతున్నారు.
ఇది మాత్రమే కాదు, అస్సామ్ వరదలు వచ్చినప్పుడు బాధితులకు సాయం అందించారు. కోవిడ్ సమయంలో జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి, తమ ఇంటినే చికిత్సాలయంగా మార్చారు. ఎంతోమందికి వ్యక్తిగతంగా సాయం అందించారు. తన కళతోనే కాక, తన మంచి గుణాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జుబీన్ లేరన్న విషాద వార్త అందర్నీ కలచివేసింది. మళ్లీ అలాంటి వ్యక్తి పుట్టబోరంటూ ఆయన అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.