ఐరాసకు అరోరా ఎందుకీ ఆకాంక్ష

Arora Akanksha of Indian Origin Announces Candidacy For UN Chief - Sakshi

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగుస్తుంది. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్‌లో ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. అనుభవజ్ఞుడైన 71 ఏళ్ల గ్యుటెరస్‌ మళ్లీ పోటీ చేస్తే కనుక మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువ. అయితే అంతటి అత్యున్నతస్థాయి పదవికి తాను పోటీ చేయబోతున్నట్లు ఏ మాత్రం అనుభవం లేని అరోరా ఆకాంక్ష అనే 34 ఏళ్ల మహిళ హటాత్తుగా ప్రకటించారు! ‘గెలుస్తానా.. లేదా తర్వాతి సంగతి. నేనైతే పోటీ చేస్తాను’ అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి డబ్బంతా మీటింగ్‌లకు, పేపర్‌వర్క్‌లకు ఎలా వృథా అవుతోందో చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు! చూస్తుంటే సమితి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన ఆకాంక్ష ఎన్నికల ప్రచారం మొదలైనట్లే ఉంది!

అరోరా ఆకాంక్షకు తన ఇంటిపేరుతో ‘అరోరా’ అని పిలిపించుకోవడమే ఇష్టం. గతంలో నాలుగేళ్లు ఆమె ఐక్యరాజ్య సమితిలోనే ఒక కంపెనీ తరఫున ఆడిటర్‌గా పని చేశారు. అది తప్ప దౌత్యవేత్తగా ఆమెకు ఏ అనుభవమూ లేదు. ఇప్పుడు సమితికే చీఫ్‌గా పోటీ పడటానికి సిద్ధం అయ్యారు! ‘‘ఒకప్పటి శరణార్థుల మనవరాలిని. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. కనుక దేశాల కష్టాలను గట్టెక్కించే ఈ పదవికి నేను అర్హురాలిననే అనుకుంటున్నాను’’ అని ఆమె చెబుతున్నారు. ప్రచారం కోసం ఆమె ఎక్కువగా తన సొంత పొదుపు నుంచే ఖర్చుచేయబోతున్నారు. ఆ మొత్తం 30 వేల డాలర్లు. రూపాయల్లో సుమారు 22 లక్షలు. అరోరా కెనడా పౌరురాలు. పుట్టింది ఇండియాలో.

2022–26 పదవీ కాలానికి జరిగే సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు ఆమోదం కోసం ఈ నెల 17నే ఆమె తన దరఖాస్తు పత్రాన్ని సమితికి సమర్పించారు. ఆ వెంటనే ‘‘పేద దేశాల కోసం ఏదైతే చేయాలో దాన్ని చేయడం లో సమితి విఫలమయింది’’ అనే వ్యాఖ్యతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు! పోటీకి ఆమె పేరును ఏదో ఒక దేశం ప్రతిపాదించాలి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సమితి నుంచి ఇంతవరకూ అలాంటి సమర్థన ఏదీ రాలేదు. పోటీ చేయలేకపోయినా, పోటీ చేయాలన్న ఆమె ప్రయత్నం వైపు మాత్రం ప్రపంచ దేశాల తలలన్నీ తిర గనయితే తిరిగాయి. చిన్న దేశాలను సమితి చిన్న చూపు చూస్తోందని అరోరా ఆరోపణ. ఏటా సమితికి వచ్చే 56 బిలియన్‌ డాలర్ల రాబడిలో డాలరుకు 29 సెంట్లు మాత్రమే సకారణంగా ఖర్చువుతుండగా, మిగతా అంతా సమావేశాలకు, నివేదికల తయారీకి వృథా అవుతోందన్నది ఆమె చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తను ఎంపికైతే ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇస్తున్నారు.

‘అయినా సరే, తను గెలుస్తుంది అని ఎలా అనుకుంటోంది..’ అని పరిహసించేవాళ్ల ఉండొచ్చు. అయితే ఆమెను సమర్థించేవారూ లేకపోలేదు. ‘ఫియర్‌లెస్‌’ అని కొందరు. ‘ఎందుకు పోటీ చేయకూడదు?’ అని ఇంకొందరు. దీనికి భిన్నంగా.. ‘75 ఏళ్ల చరిత్ర గల ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో ఈమెకు ఏం తెలుసు?’ అనేవారు ఎలాగూ ఉంటారు. సమితి లో శాశ్వత సభ్యత్వం గల దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు వీటో చేస్తే ఏ నిర్ణయమైనా వీగిపోక తప్పని స్థితిలో ఈమె వచ్చి ఏం మారుస్తుంది అని మరో మాట! అవేవీ పట్టించుకోవడం లేదు ఆరోరా. రానున్న ఒకటి రెండు నెలల్లో ఆమె సమితి రాయబారులను కలిసి తన లక్ష్యం ఏమిటో వివరించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పటి ఆమె సహోద్యోగుల నుంచి కూడా అరోరాకు మద్దతు లభిస్తోంది. ‘నాకేమీ గెలుపు వ్యూహాలు, రాజకీయ ధ్యేయాలు లేవు. సమితి పనితీరును మెరుగు పరిచేందుకు నిజాయితీగా పోటీలోకి దిగుతున్నాను’’ అని చెబుతున్నారు అరోరా.
∙∙
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన  కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నారు అరోరా ఆకాంక్ష. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. జీతాన్ని పొదుపుగా వాడుకుంటారు. తల్లిదండ్రులూ ఆమెతోనే ఉంటారు. సమితికి పోటీ చేసే విషయంలోనూ వారు ఆమె వైపే ఉన్నారు. అరోరాకు హ్యారీపొట్టర్‌ నవలలంటే ఇష్టం. ఒత్తిడుల నుంచి అవి ఆమెను సేద తీరుస్తాయట. ఆమె వార్డ్‌రోబ్‌ నిండా అన్నీ ముదురు వర్ణాల దుస్తులే. సమితి ఫీల్డ్‌ వర్క్‌ మీద 2017లో ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఆరు సూట్లు కూడా వాటిల్లో ఉన్నాయి. ఉగాండా వెళ్లినప్పుడు అక్కడ ఆమె చూసిన ఘోరం గురించి ఇక్కడ చెప్పాలి.
అరోరా హర్యానాలో జన్మించారు. తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తొమ్మిదో యేట నుంచి 18 ఏళ్ల వయసు వరకు అరోరా ఇండియాలోని బోర్డింగ్‌ స్కూల్లో చదివారు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే ఒక ప్రేవేట్‌ కంపెనీలో ఆడిటర్‌గా చేరారు. ఆ కంపెనీ తరఫున 2016 లో ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం రాగానే ఎగిరి గంతేసి చేరిపోయారు.

ఐక్యరాజ్య సమితి అంటే అంత గొప్ప ఆమెకు. అయితే ఆ గొప్ప లోపలికి వెళ్లాక కనిపించలేదు! తర్వాతి ఏడాది వేసవిలోనే అరోరాకు ఉగాండా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడో చిన్నారి.. ఆకలి బాధ తట్టుకోలేక బురద ముద్దల్ని తినడం ఆమె మనసును కలచి వేచింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలా ఉండిపోయింది. డ్యూటీకి తిరిగొచ్చాక సమితిలోని తన సీనియర్‌ ఆఫీసర్‌తో ఆ సంగతి ని ఆమె ఎంతో ఆవేదనగా చెప్పినప్పుడు ఆ ఆఫీసర్‌ స్పందించిన తీరు ఆమెను మరింతగా బాధించింది. ‘బురద మంచిదేలే. ఐరన్‌ ఉంటుంది’ అని అన్నారట! అది తట్టుకోలేక పోయారు అరోరా. క్రమంగా సమితిలోని అలక్ష్యాలు, సమితి నిరాదరణలు ఒక్కోటీ ఆమె కంటబడటం మొదలైంది. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఆమెను సమితి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు బలంగా ప్రేరేపిస్తున్నాయి. అరోరా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే పోటీ చేయాలన్న ఆలోచననే ఒక గెలుపుగా భావించాలని ఆమెను సమర్థించేవారు అంటున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top